బీచ్‌రోడ్డు: ఎస్బీఐ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో అఖిల భారత భారతీయ స్టేట్ బ్యాంక్ కార్మిక సంఘం అధ్వర్యంలో దేశ వ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు సంఘం కార్య నిర్వాహక సభ్యురాలు ఎ.సుష్మ తెలిపారు. ఈ మేరకు సమ్మె వివరాలను నగరంలోని సంఘం కార్యాలయంలో గురువారం వెల్లడించారు. తాము ఎదుర్కొంటున్న 16 సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు విన్నవించుకున్నా పరిష్కారం లభించలేదన్నారు. 29 ఏళ్లుగా మెసెంజర్లు, అర్మ్డ్ గార్డుల నియామకం చేపట్టలేదని, వాటిని తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగాల భర్తీ, ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ తదితర అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో సంఘం విశాఖ ప్రాంత ఉపాధ్యక్షుడు పి.సతీష్, సహాయ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


