విశాఖ సిటీ: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే దిశగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) కీలక అడుగు వేసింది. పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద 150 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను సీతమ్మధారలోని సంస్థ ప్రధాన కార్యాలయ భవనంపై ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ను డీసీఐఎల్ ఎండీ, సీఈవో కెప్టెన్ ఎస్.దివాకర్ గురువారం ప్రారంభించారు. కేంద్ర ఓడరేవుల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ భాగస్వామ్యంతో లెడ్యూర్ లైటింగ్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసింది. గత మార్చి 29న డీసీఐఎల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ప్లాంట్ పనులను వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం దిశగా డీసీఐఎల్ తన ప్రయాణాన్ని వేగవంతం చేసిందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 750 యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని, అంటే నెలకు 22,500 యూనిట్లు, ఏడాదికి సుమారు 2.7 లక్షల యూనిట్ల విద్యుత్ లభిస్తుందని వెల్లడించారు. దీని వల్ల సంస్థకు నెలకు రూ. 2.5 లక్షలు, ఏడాదికి సుమారు రూ. 30 లక్షల మేర విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని వివరించారు. ఈ ప్లాంట్ వల్ల ఏడాదికి సుమారు 220 నుంచి 240 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది 10 వేల మొక్కలు నాటడంతో లేదా 50 ప్యాసింజర్ వాహనాలను రహదారిపై నుంచి తొలగించడంతో సమానమని ఆయన పేర్కొన్నారు.


