అభివృద్ధికి దూరం! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి దూరం!

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

అల్లూరి స్మారకం..

రాజేంద్రపాలెంలో అభివృద్ధికి నోచుకోని అల్లూరి పార్కు

కొయ్యూరు: తెలుగుజాతి పౌరుషానికి ప్రతీక, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్‌ పాలకులపై పోరాటం సాగించిన చారిత్రక ప్రాంతాలు నేడు పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. అల్లూరిని బ్రిటీష్‌ వారు బంధించిన మంప, ఆయనను కాల్చి చంపిన రాజేంద్రపాలెం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ ఒక భారీ పర్యాటక కారిడార్‌ ఏర్పాటు చేస్తామని పాలకులు దశాబ్ద కాలంగా హామీలు ఇస్తున్నప్పటికీ, అవి నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి.

అసంపూర్తిగా సుందరీకరణ

దేశం గర్వించదగ్గ విప్లవ వీరుల జ్ఞాపకాలను భావితరాలకు అందించేలా భద్రపరచాల్సింది పోయి, ఇక్కడ అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లూరి చరిత్రను తెలుసుకోవాలని ఆకాంక్షతో అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంప పార్కు..

కేంద్ర సాంస్కృతిక శాఖ నిధులతో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అల్లూరి స్నానం చేసే కొలనును ఆధునికీకరించి, చుట్టూ నడక దారిని ఏర్పాటు చేసినప్పటికీ పనులు పూర్తికాలేదు.

● అక్కడ ఉన్న స్మారక స్థూపంపై అల్లూరి జనన, మరణ వివరాలు కనీసం పొందుపరచలేదు. చరిత్రను వివరించేందుకు ఏర్పాటు చేసిన దృశ్య ఫలకాలు కూడా అసంపూర్తిగా ఉండటంతో పర్యాటకులకు సరైన సమాచారం అందడం లేదు. కనీసం చిన్న పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు.

రాజేంద్రపాలెంలో అదే తీరు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా రాజేంద్రపాలెంలో అల్లూరితో పాటు ఆయన అనుచరులు గాం గంటన్నదొర, మల్లుదొర, బోనంగి పడాల్‌ విగ్రహాలను గత ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆవిష్కరించారు. అయితే, ఆ విగ్రహాల చుట్టూ పార్కును సుందరీకరించి, మొక్కలు నాటి నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. సరైన వసతులు లేకపోవడంతో పర్యాటకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.

ఆగిపోయిన రోప్‌వే ప్రాజెక్టు

అల్లూరి తన పోరాట వ్యూహాలను రచించిన ఉర్లకొండ గుహ మంపలోని కొలనుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎత్తైన కొండపై ఉండటంతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడికి రోప్‌వే నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ, ఆ ప్రతిపాదన నేటికీ ఆచరణకు నోచుకోలేదు.

నేడు ప్రముఖులు రాక..

మంప, రాజేంద్రపాలెం ప్రాంతాల అభివృద్ధిపై చర్చ జరుగుతున్న తరుణంలో, గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ ప్రాంతాలను సందర్శించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. కనీసం ఇప్పటికై నా పాలకులు స్పందించి, మన్యం వీరుడి జ్ఞాపక చిహ్నాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

కార్యరూపం దాల్చని పర్యాటక కారిడార్‌

దశాబ్దకాలంగా ప్రతిపాదనలతో సరి

కానరాని రోప్‌వే

శిథిలావస్థలో చరిత్ర సాక్ష్యాలు

చెదురుతున్న విప్లవ వీరుడి జ్ఞాపకాలు

నేడు అల్లూరి వర్ధంతి

మంప పార్కులో ఏర్పాటుచేసిన అల్లూరి విగ్రహం

పార్కును అభివృద్ధి చేయాలి

మంపలో అల్లూరి స్మారక పార్కును చూసేందుకు ప్రజలు వస్తారు.అయితే ఇక్కడ ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లేవు. పార్కులో పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉర్లకొండ గుహకు మార్గం ఏర్పాటుచేయాలి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి.

– బి.శివరామరాజు, మాజీ ఎంపీటీసీ, మంప

Advertisement
 
Advertisement
Advertisement