జాతీయ రహదారి మార్గంలో జీపు బోల్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారి మార్గంలో జీపు బోల్తా

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

జి.మాడుగుల: వంజరి–లంబసింగి జాతీయ రహదారిపై బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో బండరాయిని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. జి.మాడుగుల నుంచి తాజంగి వైపు ప్రయాణికులతో జీపు బయలుదేరింది. మార్గమధ్యలో బ్రేకులు సరిగా పడటం లేదని గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. ములకాయిపుట్టు గ్రామ సమీపంలోకి వచ్చేసరికి జీపును నిలిపివేయాలని డ్రైవర్‌ ప్రయత్నించాడు. అయితే రోడ్డు వాలు (డౌన్‌)గా ఉండటంతో బ్రేకులు అస్సలు పడలేదు. ప్రమాదాన్ని పసికట్టిన డ్రైవర్‌, వాహనం లోయలో పడకుండా ఉండేందుకు సమయస్ఫూర్తితో జీపును కుడివైపు ఉన్న మట్టి రోడ్డు వైపు మళ్లించాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొన్న జీపు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో బూసుపల్లి గ్రామానికి చెందిన జి చంద్రమ్మ, ఏఎన్‌ఎం సొలభం–2 ఈశ్వరమ్మ, జి.మాడుగులకు చెందిన ఈశ్వరి, మలివలస గ్రామానికి చెందిన కొర్రాచొంచల, వంతాల భూమి, కిల్లో డొంబయ్‌, అరకువేలీకి చెందిన వంతాల భాగ్యలక్ష్మి, ములకాయిపుట్టుకు చెందిన కిల్లో వినోద్‌కుమార్‌, లాజర్‌, కిముడు నాయుడు, పెదకిల్తారికి చెందిన వనగల కృష్ణవంశీ, చింతల దేవి గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.

ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

చింతపల్లి: మండలంలోని తాజంగి జలాశయం సమీపంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. బాధితులు లంబసింగి నుండి జి.మాడుగుల మండలం గెమ్మెలి గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

నియంత్రణ కోల్పోయి..

జలాశయం సమీపంలోకి రాగానే ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గెమ్మెలి గ్రామానికి చెందిన ఉల్లి పద్మ, ఉల్లి నరసమ్మ, గెమ్మెలి రాజులమ్మలు గాయపడ్డారు.

ఆస్పత్రికి తరలింపు

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యురాలు చందన బాధితులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.

12 మందికి గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement