మనసులు గెలిచిన ప్రేమికులు | - | Sakshi
Sakshi News home page

మనసులు గెలిచిన ప్రేమికులు

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

ముంచంగిపుట్టు: సాధారణంగా ప్రేమించుకున్న జంటలు పెద్దలను ఎదిరించి వెళ్లిపోవడం, ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పెద్దలు అంగీకరించడం మనం చూస్తుంటాం. కానీ, ముంచంగిపుట్టు మండలంలోని జర్జుల పంచాయతీ పరిధిలో ఒక ప్రేమ జంట తమ పెళ్లికి తల్లిదండ్రులను ఒప్పించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేటి యువతకు ఇది ఒక వినూత్న పాఠంలా నిలుస్తోంది.

ఏం జరిగింది?

స్థానిక గ్రామానికి చెందిన ఒక యువతీ యువకుడు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పకుండా బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే, తాము పెళ్లి చేసుకున్నప్పటికీ, తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మనసు నొవ్వకూడదని ఆ జంట భావించింది. తమపై వారు పెంచుకున్న మమకారాన్ని, తమ కోసం వారు పడిన కష్టాన్ని గుర్తించి ఒక విచిత్రమైన, భావోద్వేగపూరితమైన ఒప్పందానికి శ్రీకారం చుట్టారు.

వినూత్నమైన ’తంతు’..

బుధవారం గ్రామ పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల తల్లిదండ్రులను కూర్చోబెట్టి, ఆ ప్రేమికులు ఒక ఆసక్తికరమైన కార్యక్రమం నిర్వహించారు. తాము చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు తమ కోసం చేసిన ప్రతి పనికి, పడిన ప్రతి కష్టానికి గుర్తుగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చిన్నప్పుడు తమకు స్నానం చేయించినందుకు, తినిపించినందుకు, దుస్తులు కొనిచ్చినందుకు.. ఇలా ప్రతి జ్ఞాపకానికి గుర్తుగా రూ.10 నుంచి రూ.50 వరకు తల్లిదండ్రుల చేతిలో పెడుతూ వారి ఆశీస్సులు తీసుకున్నారు. నగదుతో పాటు కొత్త దుస్తులు, అవసరమైన వస్తువులను కానుకలుగా సమర్పించి వారి మనసులను గెలుచుకున్నారు.

ఆదర్శంగా నిలిచిన వైనం

ఎటువంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా, తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో ఆ ప్రేమ జంట వ్యవహరించిన తీరును చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. తమ స్వార్థం కోసం తల్లిదండ్రులను వదిలేసే ఈ రోజుల్లో, వారి కష్టాన్ని స్మరించుకుంటూ ఈ విధంగా వినూత్నంగా కలిసిపోవడం చూసి పలువురు మెచ్చుకున్నారు. ఇది నేటి యువతకు ఒక మంచి ఆదర్శమని స్థానికులు చర్చించుకుంటున్నారు.

పెద్దల సమక్షంలో తల్లిదండ్రుల్ని

ఒప్పించేందుకు వినూత్న ప్రయత్నం

Advertisement
 
Advertisement
Advertisement