రీ సర్వేలో వసూల్‌ రాజాలు | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేలో వసూల్‌ రాజాలు

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

సర్వే పేరిట రైతులకు ముప్పు తిప్పలు అనధికార వసూళ్లకు తెరలేపిన సర్వే బృందం అక్రమాల పుట్టగా భూముల రీ సర్వే తలనొప్పిగా 64 గ్రామాల్లో రీ సర్వే పనులు

మహారాణిపేట: జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వేలో అవినీతి కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. కొంత మంది సర్వేయర్లు వసూల్‌ రాజాలుగా మారుతున్నారు. తమ కార్యాలయంలో అన్నీ తామై చేసేస్తామని రైతులను నమ్మబలుకుతూ రాయ‘బేరాలు’నడుపుతున్నారు. ఇక్కడకు వచ్చే అధికారులు తమ గుప్పిట్లోనే ఉంటారని, వారందరికీ వాటాలు ఇచ్చి.. మీకు అనుకూలంగా పనులు చేస్తామని నమ్మించి, రైతుల్ని నిలువునా ముంచేస్తున్నారు.

64 గ్రామాల్లో రీ సర్వే

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలోని పెందుర్తి, గాజువాక, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ రూరల్‌ మండలాల పరిధి 64 గ్రామాల్లో రీ సర్వే చేపట్టారు. రెండో విడత రీ సర్వే ఇంకా ఓ కొల్కికి రాలేదు. మూడో విడత రీ సర్వే వివాదాలతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. చిన్న, సన్నకారు రైతుల భూములు ఏళ్ల తరబడి తమ సాగులో ఉన్నా.. సరైన రికార్డులు లేవన్న సాకుతో పెండింగ్‌లో పెట్టారు. జిరాయితీ భూముల సర్వేకు కూడా సర్వే బృందం వెనుకడుగు వేస్తోంది. తమ ఆధీనంలో ఉన్న పొలాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో రైతుల పేర్లు లేకపోవడం, క్రయ విక్రయాలు జరిగినా రికార్డులు అప్‌డేట్‌ చేయకపోవడం సమస్యలకు కారణమవుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి కొందరు అధికారులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని రైతులు వాపోతున్నారు.

ఆధునిక టెక్నాలజీ.. అయినా తప్పులే!

డ్రోన్లు, జీపీఎస్‌ యంత్రాలతో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ, జిరాయితీ, ఇనాం తదితర భూముల రీ సర్వే చేస్తున్నారు. మండల తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్‌వో తదితరులకు మండల, డివిజనల్‌ సర్వేయర్లు, చైన్‌మన్లు, ఇతర సిబ్బంది సహకారం అందిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ముడుపుల వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను సాకుగా చూపి సర్వేలు నిలుపుదల చేస్తున్నారని సమాచారం. వీటి పరిష్కారం పేరిట సర్వేయర్లు అన్నీ తామై చక్రం తిప్పుతున్నారు. మండలానికి ఇద్దరు ముగ్గురు సర్వేయర్లు కేవలం వసూళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ముడుపులు చెల్లించుకుంటేనే రీ సర్వే పూర్తి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లేకుంటే ఒకరి సాగులో ఉన్న భూమిని రికార్డుల్లో మరొకరి పేరిట చేర్చుతున్నారని చెప్తున్నారు. మరోవైపు రీ సర్వేలో దళారులు ప్రవేశించి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

‘సాంకేతిక’చిక్కులు.. తప్పని అవస్థలు

రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, సాగులో ఇంకోలా ఉంటే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ భూమి, ట్యాంక్‌ అని ఉంటే రైతుల తిప్పలు వర్ణనాతీతం. అన్నదమ్ముల తగాదాలు, కుటుంబ వివాదాలు, గ్రామ కంఠం, ఇనాం భూముల్లో రీ సర్వే పూర్తవ్వాలంటే చేతులు తడపాల్సిందేనని రైతులు వాపోతున్నారు. కొంత మంది అధికారులు ఇలాంటి జాబితాను వీఆర్వోలకు అందించి, వారిని రైతుల వద్దకు పంపి బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి రైతుల సాగులో ఉన్నా.. రికార్డుల్లేని భూములకు ముడుపులివ్వకుండా పాస్‌ పుస్తకాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement