నర్సీపట్నం: తప్పుడు కేసులు పెట్టిన వారు భవిష్యత్తులో శిక్ష అనుభవించక తప్పదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లి దొర పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నం పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాల వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చిందన్నారు. స్టే ఇచ్చినప్పటికీ పనులు చేస్తుండడంతో వాటిని ప్రజలు దృష్టికి తీసుకువెళ్లేందుకు చెరువు వద్దకు గణేష్ వెళ్తే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు దాడి చేశారన్నారు. పెద్ద చెరువు ప్రజల ఆస్తి అక్కడ అనధికారికంగా వాచ్‌మెన్‌ను పెట్టడం దారుణమన్నారు. వాచ్‌మెన్‌తో తప్పుతు ఫిర్యాదు చేయటం మరింత దుర్మార్గమన్నారు. వారిపై మాజీ ఎమ్మెల్యే కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. స్పీకర్ ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా మాజీ ఎమ్మెల్యే గణేష్, అనుచరులు పీఏ బాబు, పట్టణ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకా శివ, సుర్లనాయుడులపై కేసు పెట్టారన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని లీగల్ సెల్ ప్రతినిధి బుల్లిదొర పేర్కొన్నారు. భవిష్యత్తులో వీరంతా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.


