గాజువాక/రావికమతం: శ్రీనగర్ జంక్షన్ జాతీయ రహదారిపై ఓ లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావికమతం మండలం గడ్డిప గ్రామానికి చెందిన గల్లా రవి(48) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బయ్యవరంలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీనుంచి సిమెంట్ లోడుతో లారీలో శ్రీనగర్‌కు చేరుకున్నాడు. మంగళవారం రాత్రి లారీని శ్రీనగర్‌లో ఆపి విశ్రాంతి తీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి కొద్దిసేపు అటు, ఇటు తిరిగి మళ్లీ పడుకున్నాడు. ఎంతసేపటికీ నిద్ర లేవకపోవడంతో ఇతర లారీల సిబ్బంది లేపారు. అయినప్పటికీ లేవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన పోలీసులు రవి మృతి చెందినట్టు నిర్థారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు వంశీ,హర్ష,కుమార్తె వనిత ఉన్నారు. భార్య రాజేశ్వరికి కొన్నాళ్ల కిందట ఓ ఆపరేషన్ జరిగింది. ఆది వికటించించడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది.ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. రవి మరణ వార్త విన్న గుడ్డిప గ్రామస్తులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని తరలించారు. మృతుడి తల్లి,భార్య,పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.దీంతో గుడ్డిప గ్రామంలో విషాధ ఛాయులు అలుముకున్నాయి. కుమారుడు వంశీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


