బీభత్సం | - | Sakshi
Sakshi News home page

బీభత్సం

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

భారీ వర్షం... ఈదురుగాలుల
పెదబయలు వారపు సంతలో కూలిన భారీ చెట్టు
నలుగురుకి తీవ్ర గాయాలు

చెట్టు కింద చిక్కుకున్న చిట్టమ్మ, ఇచ్చమ్మ మృతదేహాలు

పెదబయలు: మండల కేంద్రం పెదబయలులో సోమవారం జరిగిన వారపు సంతకు జిల్లాలోని పలు ప్రాంతల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి ప్రజలు వచ్చారు. సంత జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం 3గంటలకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇంటికి కావలసిన సరుకులు కొనేందుకు సంతకు వచ్చిన ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా పాతులొంగి పంచాయతీ జర్రాయి గ్రామానికి చెందిన కొర్ర చిట్టమ్మ(30),కోడా ఇచ్చమ్మ(40)లు సంతలో టార్పాలిన్‌తో కప్పిన కర్రల పందిరిలోకి వెళ్లి కూర్చున్నారు. ఈదురు గాలులకు సంత ప్రాంగణంలో ఉన్న భారీ చెట్టు వారు ఉన్న పందిరిపై కూలిపోయింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి భర్త, పిల్లలు ఉన్నారు. ఒడిశా రాష్ట్రం పాతులొంగి గ్రామానికి చెందిన పి.మోని, కుడ గ్రామానికి చెందిన కె.ప్రమీలతో పాటు పి.పూర్ణచందర్‌,ఎస్‌.కోములు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను 108 వాహనంలో హుటాహుటిన స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.వైద్యాధికారి నిఖిల్‌ వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్య సేవల కోసం మోని,ప్రమీలలను అంబులెన్స్‌లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. చెట్టు కింద ఉన్న ఇద్దరు మహిళల మృతదేహాలను ఎస్‌ఐ వెంకటేష్‌,పోలీసులు అతికష్టం మీద బయటకు తీసి, పోర్టుమార్టానికి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు.ఎంపీడీవో కార్యాలయ ఏవో పూర్ణయ్య,ఆర్‌ఐ పూర్ణయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

భారీ చెట్లతో భయం..భయం..

పెదబయలు వారపు సంత ప్రాంగణం చుట్టూ భారీ చెట్లు ఉండడంతో సంతకు వచ్చిన వారు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. సంతకు ఆనుకుని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం,నివాస గృహాలు ఉన్నాయి.భారీ చెట్లు తొలగించాలని గతంలోనే మండల ప్రజా పరిషత్‌ సమావేశంలో సభ్యులు తీర్మానం చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. గతంలో పలుమార్లు చెట్లు కూలి సంతకు వచ్చిన వారు గాయపడిన సంఘటనలున్నాయి. గతంలో మండల పరిషత్‌ కార్యాలయంపై చెట్టు పడి భవనం ధ్వంసమైంది. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, భారీగా ఉన్న చెట్లు తొలగించాలని మండల కేంద్రం వాసులు కోరుతున్నారు.

జి.మాడుగుల మండలంలో...

జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి.గెడ్డలు,వాగుల్లోకి భారీగా నీరు చేరింది.లంబసింగి–జి.మాడుగుల, పాడేరు జాతీయ రహదారి పనుల్లో భాగంగా వేసిన మట్టి రోడ్డు బురదమయంగా మారింది. ఈరోడ్డులో రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీకర శబ్దాలతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షం కారణంగా జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది.

చెట్టు కింద నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీసులు

డుంబ్రిగుడ మండలంలో బాలిక మృతి

ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళలు మృతి

Advertisement
 
Advertisement
Advertisement