ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
డుంబ్రిగుడ: విశాఖనగరంలో ప్రత్యేకంగా గిరిజన రైతు బజారు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు కోరారు. గిరిజన రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని, వారి కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్ద క్యాబేజీ కిలో రూ.3 నుంచి రూ.5కు కొనుగోలు చేసి, మార్కెట్లో రూ.30 నుంచి రూ.50 విక్రయిస్తున్నారని తెలిపారు. చింతపండు కిలోరూ.50 కి కొనుగోలు చేసి, రూ.200 వరకూ విక్రయిస్తూ దళారులు లాభపడుతున్నారన్నారు. గిరిజనులు పండించే దినుసులు, కూరగాయలు, వాణిజ్య పంటలైన కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం, చింతపండు, జీడిపిక్కలకు వారపుసంత్లో కూడా సరైన ధరలు లేక నష్టపోతున్నారని తెలిపారు. అందువల్ల విశాఖలో ప్రత్యేక గిరిజన రైతు బజారు ఏర్పాటు చేసి, గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. గిరిజన ఉత్పత్తులను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో కోల్డ్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేసి, రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు.


