ముఖ ఆధారిత హాజరుతో కూలీలకు తంటాలు
కొండలెక్కుతున్న గిరిజనులు
గిరి శిఖర గ్రామాలకు సెల్ సిగ్నల్స్ కరువు
సాక్షి,పాడేరు: జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతనదారుల హాజరు విధానానికి సంబంధించి కేంద్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు కష్టజీవులకు శాపంగా మారి, వారిని పనికి దూరం చేస్తోంది. పని ప్రదేశాల్లో లేకుంటే, వారి పేరుతో హాజరు వేసే వీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోగా, సాంకేతిక కారణాలతో హాజరు నమోదు కాక వేతనదారులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో సెల్ టవర్లు లేకపోవడంతో పాటు ఉన్నచోట్ల కూడా పూర్తిస్థాయిలో సెల్ సంకేతాలు లేవు. ఈ పరిస్థితిలో ముఖ ఆధారిత హాజరుకు గిరిశిఖర గ్రా మాల గిరిజనులు ప్రతిరోజు నరకయాతన పడుతున్నారు.
కొండలెక్కాలిసిందే...
అనంతగిరి,డుంబ్రిగుడ,ముంచంగిపుట్టు,పెదబయలు, చింతపల్లి, జీకే వీధి,హుకుంపేట,పాడేరు మండలాల్లో సుమారు 100వరకు గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి.మారుమూల గ్రామాలు కావడంతో సెల్‌సంకేతాలు లేవు. దీంతో ముఖ ఆధారిత హాజరుకు ఎత్తైన కొండలు ఎక్కి ఉదయం,సాయంత్రం సమయాల్లో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కొన్ని గ్రామాల గిరిజనులు 3నుంచి 5కిలోమీటర్ల దూరం నడిచి ముఖ ఆధారిత హాజరు వేసుకుంటున్నారు.గత మూడు నెలల నుంచి ముఖ ఆధారిత హాజరుకు మారుమూల గ్రామాల గిరిజనులు నరకయాతన పడుతున్నారు.ఉపాధి పనులు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా భారీగా జరుగుతున్నాయి.జిల్లాలో 1.57లక్షల జాబ్‌కార్డులున్నాయి. ఈ కార్డుదారుల్లో సుమారు 20వేల మంది మారుమూల గ్రామాల గిరిజనులున్నారు. వీరికి ముఖ ఆధారిత హాజరు సక్రమంగా నమోదు కావడం లేదు.
నిత్యం ఆందోళనలు
జిల్లాలోని మారుమూల గ్రామాల గిరిజనులంతా సెల్ టవర్ల నిర్మాణాలకు డిమాండ్ చేస్తున్నారు.సెల్ సంకేతాల సమస్యతో ఉపాధి హామీ పనులు చేసిన తామంతా ముఖ ఆధారిత హాజరు వేయలేకపోతున్నామని, తమకు ఈ బాధ తప్పించాలని జిల్లాలో ఏదో ఒక గ్రామంలో రోజూ వేతనదారులు ఆందోళనలు చేస్తున్నారు. ముంచంగిపుట్టు మండం బంగారుముట్ట పంచాయతీలోని పలు గ్రామాల్లో సోమవారం ఉపాధి హామీ వేతనదారులు నిరసనకు దిగారు. ఇటీవల డుంబ్రిగుడ మండలంలోని కమలబంద,పెదబయలు మండలంలోని గొలుగొండ గిరిజనులు ఆందోళన చేశారు. అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ బొంగిజా గ్రామంలోని 450మంది గిరిజనులు సోమవారం మోకాళ్లపై నిలుచొని గ్రామ సమీపంలో ధర్నా చేశారు.ప్రతి రోజు సుమారు 12 కిలోమీటర్లు నడిచి గంగవరం ప్రాంతంలో ముఖ ఆధారిత హాజరు వేసుకుంటున్నామని.ఒక్కోసారి కొండలెక్కుతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కలెక్టర్,ఇతర అధికారులు తమ మారుమూల గ్రామాల్లో సెల్‌టవర్లు ఏర్పాటు చేసి, ఈ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.5 లక్షల విరాళం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి విజయవాడలోని భారతీనగర్‌కి చెందిన కోనేరు జగన్నాథ్, శిరీష దంపతులు రూ.5,01,116 విరాళాన్ని అందేశారు. సోమవారం సింహగిరికి వచ్చిన దాతలు సంబంధిత చెక్కును ఆలయ సూపరింటెండెంట్ సత్య శ్రీనివాస్‌కి అందజేశారు. దేవస్థానం తరపున దాతలకు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదం అందజేశారు.
సెల్‌టవర్లు ఏర్పాటు చేయాలి
అన్ని గిరిశిఖర గ్రామాల గిరిజనులకు మేలు చేసే విధంగా సెల్‌టవర్లు ఏర్పాటు చేయాలి. ముఖ ఆధారిత హాజరు కోసం మారు మూల గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సెల్ సంకేతాల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్న పట్టించుకోవడం లేదు.
–గోవిందరావు, సీపీఎం జిల్లా నాయకుడు, అనంతగిరి మండలం
రోజూ ఇబ్బందులే
ఉపాధి హామీ కూలిపనులు చేస్తున్న తామంతా ముఖ ఆధారిత హాజరుకు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నాం.సెల్ సంకేతాలు ఉన్న దూర ప్రాంతాలతో పాటు,కొండలెక్కి హాజరు వేసుకోవడం బాధగా ఉంది.సెల్‌టవర్ల వ్యవస్థను అందుబాటులోకి తేవాలి
–పాంగి వసంతకుమార్, కమలబంద గ్రామం, డుంబ్రిగుడ మండలం


