పాడేరు రూరల్: తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిఘటన తప్పదని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స తెలిపారు. సోమవారం గిరిజన భవన్‌లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల గెస్ట్ ఉపాధ్యాయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విధుల నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను తొలగించేందుకు ఇచ్చిన నోటీసును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం, ఉన్నతాధికారుల వైఖరి మార్చుకోవాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) ద్వారా నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయులను ఏవిధంగా తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రిన్సిపాళ్లు కక్షకట్టి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రిన్సిపాళ్లు గిరిజన విద్యార్థులకు సక్రమంగా భోజనం కూడా పెట్టడం లేదన్నారు. ఉత్తరభారత దేశం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలు అర్థం కాక విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ఏకంగా 115 మంది ఏకలవ్య పాఠశాలల గెస్ట్ ఉపాధ్యాయుల తొలగించేందుకు రంగం సిద్ధం చేశారన్నారు.ఈ ప్రయత్నాలను విరమించుకోకపోతే ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంఘం నాయకులు బాలదేవ్,ధర్మనపడాల్,ఏకలవ్య ఉపాధ్యాయుల సంఘం నాయకులు శ్యాంసుందర్, అరుణ్,సత్య, తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స


