డుంబ్రిగుడ: మండలంలోని కండ్రుమ్ పంచాయతీ సిందేరిగుడ గ్రామానికి చెందిన సొంగుల దివ్య(13) అనే గిరిజన బాలిక పిడుగుపాటుకు గురై మృతి చెందింది. బాలిక తండ్రి కోగేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దివ్య తన అక్క, తోటి స్నేహితులతో కలిసి కొంకొడికూర(ఆకుకూర) సేకరణకు సమీపంలోని కొండకు సోమవారం వెళ్లింది. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొంకొడికూర సేకరించిన వారు తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యంలో వారికి సమీపంలో పిడుగుపడింది. దీంతో దివ్య కుప్పకూలిపోయింది. సొంగుల మీరా అనే బాలిక అస్వస్థతకు గురైంది. మిగిలిన స్నేహితులు దివ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విగత జీవిగా పడిఉన్న దివ్య, గాయపడిన బాలికలను 108 వాహనంలో డుంబ్రిగుడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దివ్య మృతి చెందినట్లు వైద్యాధికారి రాంబాబు తెలపడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. అస్వస్థతకు గురైన బాలికకు వైద్య సేవలందించి ఇంటికి పంపారు. దివ్య డుంబ్రిగుడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. వేసవి సెలవులకు ఇంటికెళ్లింది. పిడుగుపాటు రూపంలో మృతువు ఆమెను కబళించింది. మృతిరాలికి అక్క, ఇద్దరు సోదరులున్నారు.


