ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బాలదేవ్,ధర్మనపడాల్
పాడేరు రూరల్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివాసీలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొద్దు బాలదేవ్,ధర్మనపడాల్ అన్నారు. సోమవారం పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జీవో నంబర్ 3పై మంత్రి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదని చెప్పారు. వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్, ప్రత్యేక డీఎస్సీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతంలో చేపట్టిన హైడ్రోపవర్ ప్రాజెక్టులు నిలిపివేయాలని, ప్రత్యేక గిరిజన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, పాడేరు గిరిజన ప్రాంతాన్ని జోన్– 1లోనే కొనసాగించాలని, గతంలో ఆదివాసీ ఉద్యోగ, ప్రజా సంఘాలతో పాటు నిరుద్యోగ యువతీయువకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. గతంలో పలుమార్లు గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.


