మళ్లీ చిగురించేనా? | - | Sakshi
Sakshi News home page

మళ్లీ చిగురించేనా?

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

ఉమ్మడి విశాఖ మన్యంలో ఒకప్పుడు పచ్చని బంగారంలా విరాజిల్లిన వెదురు సాగు ఇప్పుడు వెలవెలబోతోంది. అటవీ శాఖకు కాసుల వర్షం కురిపించిన వెదురు కూపీలు, నేడు సరైన నిర్వహణ లేక ఉత్పాదకతను కోల్పోతున్నాయి. గతంలో కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు వందలాది మంది గిరిజన కూలీలకు ఉపాధినిచ్చిన ఈ రంగం, ఇప్పుడు నిధుల కొరత, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పోటీతో సంక్షోభంలో పడింది.
మన్యం వెదురు..

విక్రయాల పెంపునకు ప్రణాళిక

ఈ ఏడాది 50 వేల వెదురు గడలను విక్రయించాం. వచ్చే ఏడాది ఈ విక్రయాలను మరింత పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నాం. ప్రస్తుతం కొన్ని కూపీలలో సిద్ధంగా ఉన్న వెదురును నరకడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

– వైవీ నర్సింగరావు, డీఎఫ్‌వో, చింతపల్లి

కొయ్యూరు: ఒకప్పుడు వెదురు విక్రయాల ద్వారా అటవీ శాఖకు రూ. 4 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ ఆదాయం రూ. కోటి కూడా దాటడం లేదు. గతంలో వందలాది మంది కూలీలకు వెదురు ద్వారా ఉపాధి లభించేది. అయితే, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

నిర్వహణ లోపం..

గతంలో వెదురు నరికిన తర్వాత అటవీ శాఖ పర్యవేక్షణలో మొదళ్లను శుభ్రం చేసి, మట్టిని సర్దేవారు. దీనివల్ల వెదురు తిరిగి ఏపుగా పెరిగేది. నిధుల కొరత కారణంగా ప్రస్తుతం ఈ నిర్వహణ పనులు నిలిచిపోవడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.

ముదిరిపోవడంతో..

వెదురు 30 ఏళ్లు దాటిన తరువాత పూతకు వచ్చి ఎండిపోతుంది. ఎండిన చోట కొత్త మొక్కలను నాటకపోవడం వల్ల వెదురు విస్తీర్ణం తగ్గుతోంది.

అస్సాం వెదురు నుంచి పోటీ

తక్కువ ధరకు లభించే అస్సాం వెదురు స్థానిక మార్కెట్‌లో గట్టి పోటీనిస్తోంది. దీనివల్ల ఇక్కడి వెదురు విక్రయాలపై ప్రభావం పడుతోంది.

స్థానిక వెదురుకు ఎంతో ప్రత్యేకత

కొయ్యూరు మండలంలోని పెదవలస, నల్లగొండ, కొండసంత, గంగవరం, సోలాబు, బూదరాళ్ల, మర్రిపాకల, యూ.చీడిపాలెం, ఆర్‌వీ నగర్‌, సీలేరు వంటి ప్రాంతాల్లో వెదురు కూపీలు అధికంగా ఉండేవి. అస్సాం వెదురుతో పోలిస్తే ఇక్కడి వెదురు ఎంతో దృఢమైనది. అందుకే ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, నాణ్యతను కోరుకునే వ్యాపారులు మన ప్రాంతపు వెదురుకే ప్రాధాన్యత ఇస్తారు.

పేపర్‌ మిల్లుల విధానంలో మార్పు..

రెండు దశాబ్దాల క్రితం వరకు ఇక్కడ సేకరించిన వెదురునంతా రాజమండ్రి పేపర్‌ మిల్లుకు తరలించేవారు. అప్పట్లో పేపర్‌ తయారీకి వెదురునే ప్రధానంగా వాడేవారు. కాలక్రమేణా వెదురుకు ప్రత్యామ్నాయంగా సరుగుడు వంటి ఇతర కలప రకాలు అందుబాటులోకి రావడంతో, పేపర్‌ మిల్లులు వెదురు కొనుగోలును నిలిపివేశాయి.

ఎంఎఫ్‌ఐ సంస్థ ప్రోత్సాహం

వెదురు సాగును పునరుద్ధరించేందుకు మ్యాంగ్రోవ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా నడుం బిగించింది.

అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం ప్రాంతం) జిల్లాల్లో లక్షలాది వెదురు మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెదురు సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, వారికి అవసరమైన శిక్షణను అందిస్తోంది.

ఆదాయమిలా..

20 అడుగుల వెదురు గడ ప్రస్తుతం రూ. 250 పైగా పలుకుతోంది. ఒకసారి నాటితే కనీసం 25 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఫర్నీచర్‌, పేపర్‌ తయారీ, బయో ఇంధనం, వస్త్ర పరిశ్రమల్లో వెదురుకు భారీ డిమాండ్‌ ఉంది. ప్రభుత్వం నిర్వహణ పనుల కోసం నిధులు కేటాయించి, రైతులకు సరైన ప్రోత్సాహం అందిస్తే వెదురు సాగు తిరిగి పూర్వవైభవాన్ని పొందే అవకాశం ఉంది.

వెలవెలబోతున్న సాగు

అటవీశాఖ నిర్వహణలోపం

కోల్పోతున్న ఉత్పాదకత

ఒకప్పుడు వేలాది మందికి ఉపాధి

ఇప్పుడు నిధుల కొరత,

ఇతర రాష్ట్రాల పోటీతో సంక్షోభం

Advertisement
 
Advertisement
Advertisement