తగరపువలస: దాతలు భక్తితో దేవుడికి సమర్పించిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులు భీమిలి నియోజకవర్గంలో కబ్జాదారుల పాలవుతున్నాయి. ఆస్తులను సంరక్షించాల్సిన దేవదాయ శాఖ అధికారుల అలసత్వం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వెరసి భూములు చేతులు మారుతున్నా అడిగే వారే కరువయ్యారు.
వరుసగా అన్యాక్రాంతమవుతున్న భూములు
ఇటీవల ఆనందపురం మండలం శిర్లపాలెంలో పాండ్రంగి వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన 22.70 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినా అధికారులు పట్టించుకోలేదు. ‘సాక్షి’ కథనాలతో ఉన్నతాధికారులు స్పందించి సర్వేకు ఆదేశించే వరకు స్థానిక సిబ్బంది మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే దాకమర్రి నీలయమ్మ సత్రానికి చెందిన 23 ఎకరాల పల్లం భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 1966 నుంచి ఈ భూములపై ఒక్క పైసా శిస్తు కూడా వసూలు చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పట్టించుకోని ఈవోలు
సంగివలస ముగ్గురు అమ్మవార్ల ఆలయానికి వస్తున్న ఈవోలు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల రక్షణ బాధ్యతను దిగువ స్థాయి సిబ్బందికి వదిలేయడంతో వారు ఆడింది ఆటగా సాగుతోంది. ఆలయ పరిసరాల్లో నిత్యం కొత్త దుకాణాలు వెలుస్తున్నా నియంత్రణ లేదు. చిల్లపేటతో పాటు భీమిలి టౌన్ సర్వే నంబర్ 18లో ఉన్న లంగర్‌ఖానా భూములు కూడా రోజురోజుకు ఆక్రమణలకు గురవుతున్నాయి.
భక్తుల ఆందోళన
దాతలు సదుద్దేశంతో ఇచ్చిన సత్రం భూములు, లంగర్‌ఖానా ఆస్తులు హారతిలా కరిగిపోతుంటే దేవాదాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర సర్వే నిర్వహించి కబ్జాకు గురైన దేవుని భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.


