
హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందం రద్దుకు వినతి
పాడేరు రూరల్: హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాల జీవోలను రద్దు చేయాలని కోరుతు పాడేరు ఐటిడిఏ పీవో తిరుమణిశ్రీపూజకు ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స, హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామల గిరిజనులు కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అరాచకపాలన చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా కొత్త సమస్యలతో ప్రజలకు భయబ్రాంతులు గురి చేస్తుందన్నారు.హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం సమగ్ర కమిటి పేరుతో సర్వే నిర్వహిస్తే గిరిజనులతో అడ్డుకుంటమన్నారు. జిల్లాలో అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులు, చట్టాలను ప్రభుత్వం ఉల్లంఘించి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి తాత్కలిక పనులు నిలిపివేస్తున్నట్టు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్, రాష్ట్ర గిరిజన సలహా మండలి, ఐటిడిఏ పాలక వర్గం, వివిద ప్రభుత్వ చట్టబద్ద వేదికల్లో చర్చించకుండానే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు తాత్కలిక పనులు నిలుపుదల చేసామని ప్రకటించడం ఆదివాసీలకు మోసం చేయాడమేనన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని లేనిపక్షంలో ఈనెల 24న చలో కలెక్టరేట్ పాడేరు కార్యక్రమం పిలుపునిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రజలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆదివాసీ గిరిజన సంఘం నేతలు కిల్లో సురేంద్ర, గంగరాజు, బాలదేవ్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.