
బిల్లులు, వేతనాలు అందకే అసంతృప్తి
● మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం ● జెడ్పీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి ● మీడియాతో జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
మహారాణిపేట: జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్ నుంచి గత 12 నెలలుగా అభివృద్ధి పనుల బిల్లులు విడుదల కాకపోవడం, అలాగే జెడ్పీటీసీలకు చాలా నెలల నుంచి గౌరవ వేతనం రాకపోవడం వంటి సమస్యలపై జెడ్పీటీసీలు అసంతృప్తితో ఉన్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె. సుభద్ర తెలిపారు. ఆదివారం సాయంత్రం జెడ్పీ బంగ్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది నుంచి దాదాపు రూ. 8.5 కోట్ల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా విడుదల కావాల్సి ఉందని చైర్‌పర్సన్ తెలిపారు. ఈ ఏడాది జూన్ చివరి వరకు పూర్తయిన పనులకు ఎలాంటి బిల్లులు మంజూరు కాలేదన్నారు. ఈ బిల్లులు ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి ఉండడంతో సభ్యులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. జెడ్పీటీసీల గౌరవ వేతనం కూడా పెండింగ్‌లో ఉండటం అసంతృప్తికి మరో ప్రధాన కారణమని వివరించారు.
అపోహలు తొలగాయి..
జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులందరూ కలిసి చర్చించుకున్నామని, తమలో ఎలాంటి అసంతృప్తులు లేవని జె. సుభద్ర స్పష్టం చేశారు. వారంతా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పని చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామన్నారు. సమన్వయ లోపం వల్ల చిన్నపాటి సమస్యలు ఉత్పన్నమైనా, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. ఈ సమస్యల గురించి పార్టీ నాయకులకు అన్ని విషయాలను కూలంకషంగా వివరించినట్లు తెలిపారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఇతర నాయకులు ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సుభద్ర పేర్కొన్నారు. ఈ సమస్య రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉందని జెడ్పీటీసీలకు వివరించడంతో వారిలో ఉన్న అపోహలు తొలగాయని ఆమె చెప్పారు. పార్టీ సూచనల మేరకు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ, ఇతర సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రతి జెడ్పీటీసీతో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ సమావేశం అనంతరం పూర్తి సహకారం అందిస్తామని జెడ్పీటీసీలు హామీ ఇచ్చినట్టు సుభద్ర పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న విషయాలను కలెక్టర్ హరేందిర ప్రసాద్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.