తెగుళ్ల తీగ సాగులేక..
● తమలపాకు తోటల యాజమాన్యం అవసరం
● సస్యరక్షణతో చర్యలతో మంచి దిగుబడి
పెరవలి: జిల్లాలో తమలపాకు తోటలు 183 హెక్టార్లలో సాగవుతున్నాయి. పెరవలి, కొవ్వూరు, నల్లజర్ల, కడియం మండలాల్లో సాగులో ఉన్న పంటపై తెగుళ్లు దాడి చేస్తుండడంతో అవి ఆకులు మాడిపోయి రైతుకు నష్టాలు మిగులుస్తున్నాయి. సహజంగా అయితే తీగ నాటిన రెండో నెల నుంచే ఆకులు కోతకు వస్తాయి. ఏడాదికి దిగుబడి 30 వేల పంతాలు వస్తుంది (పంతం అంటే 100 ఆకులు). ఎకరం తోటకు రూ.4 లక్షలు పెట్టుబడి అవసరం అవుతుంది. దిగుబడి బాగుండి ఎగుమతులు బాగుంటే పెట్టుబడి పోను రూ.4 లక్షల ఆదాయం వస్తుంది. అదే తెగుళ్లు సోకి దిగుబడి తగ్గితే ఒక్కొక్క సారి పెట్టుబడి సైతం కోల్పోవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వాతావరణంలో అధికంగా తేమ ఉండడమే తెగుళ్లకు కారణమని, దీనివల్ల పొగాకు లద్దె పురుగు, అగ్గిపురుగు, నల్లి, బర్మా పురుగు, ఎండుతెగులు, బాక్టీరియా, ఆకుమచ్చ తెగులు, కొలటోట్రై కం ఆకుమచ్చ తెగులు వంటివి ఆశించాయని కొవ్వూరు ఉద్యానవన అధికారి డి.సుధీర్ కుమార్ తెలిపారు. వీటి నివారణకు రైతులు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యల గురించి ఇలా వివరిస్తున్నారు.
పొగాకు లద్దె పురుగుకు వేపనూనెతో సరి
తమలపాకు తోటపై పొగాకు లద్దెపురుగు ఆశిస్తే ఆకులను తీవ్రంగా నష్టపరుస్తాయి. ఆకులను తింటూ రంధ్రాలు చేస్తాయి. దీని వల్ల మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాదు. దీని నివారణకు 5 మిల్లీ లీటర్ల వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి ఒక లీటరు వేపనూనె పిచికారీ సరిపోతుంది.
అగ్గిపురుగు నివారణ ఇలా..
ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులపై కాలిన మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు ఉధృతంగా ఉంటే ఆకులు పసుపుబారి కుళ్లిపోతాయి. దీని నివారణకు కార్బరిల్ 50 శాతం 2 గ్రాముల పొడిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి
ఆకును ముడత పెట్టే నల్లి
ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ముడతపడతాయి. దీనివల్ల పంటకు తీవ్ర నష్టం. దీని నివారణకు లీటరు నీటికి 4 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి పిచికారీ చేయాలి.
అవిశె మొక్కల తలలు తుంచేస్తే..
బర్మా పురుగులు అవిశె మొక్కల కాండంలోపల భాగాన్ని తొలిచివేయడం వలన బలహీనపడి మొక్కలు విరిగిపోతాయి. దీనివల్ల తమలపాకు తీగలు పైకి వెళ్లడానికి ఆస్కారం లేక తీగలు దెబ్బతింటాయి. ఈ పురుగు అవిశె మొక్కలను సోకిన వెంటనే మొక్కల తలలను విరిచేస్తే వీటి ప్రభావాన్ని తగ్గించవచ్చు.
కొలటో ట్రై కం ఆకుమచ్చ తెగులు
తెగులు సోకిన ఆకుల పైభాగాన గుండ్రని గోధుమరంగుతో కూడిన పసుపురంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ నల్లబడి ఆకంతా వ్యాపిస్తాయి. ఈ తెగులు సోకిన ఆకులు నాణ్యత కోల్పోతాయి. దీని నివారణకు 3 కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది.
ఎరువుల యాజమాన్యం
తమలపాకుల తోట వేసే రైతులు దుక్కులో 40 కిలోల సూపర్ ఫాస్పేట్, 40 కిలోల పొటాష్ వేసి రెండుసార్లు దుక్కి దున్నాలి. తీగ నాటిన రెండునెలల నుంచి ఎకరానికి నత్రజని, వేపపిండి, యూరియా 1:1 నిష్పత్తిలో 3 రకాలను 80 కిలోలు ఉండేలా ఎరువులను వేయాలి. ఇలా సంవత్సరానికి పరిస్థితులను బట్టి 4 నుంచి 6 దఫాలుగా పొలానికి అందించాలి. ఎకరానికి ఒక టన్ను జిప్సం కూడా వేయాల్సి ఉంది.
బర్మా పురుగు సోకకుండా అవిశె మొక్కల తలలను విరుస్తున్న కూలీలు
ఉమ్మిడివారిపాలెంలో తెగుళ్లు సోకిన తమలపాకు తోటలు
ఎండు, మొదలు కుళ్లు తెగుళ్లకు..
ఆకులపై గుండ్రటి గోధుమరంగు మచ్చలు ఏర్పడి నల్లగా మారతాయి. తెగులు తీగ మొదట్లో ఆశించినప్పుడు వేరు గోధుమరంగుకి మారి తరువాత నల్లగా మారి కుళ్లిపోతాయి. ఈ దశలో తీగపై ఆకులు పసుపురంగుకి మారి క్రమంగా ఆకులు, తీగలు ఎండిపోతాయి. దీని నివారణకు తెగులు లక్షణాలు ఉన్న ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నెలకు ఒకసారి 0.5 శాతం బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
బాక్టీరియా ఆకుమచ్చ తెగులు
ఆకుల అడుగుభాగాన గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవై నలుపు రంగుకు మారి ఆకులు కుళ్లిపోతాయి. ఇవి మొక్కపైన, కాండంపైన, తీగలను ఆశించినప్పుడు అవి పగుళ్లు ఏర్పడటం, నలుపు మచ్చలు ఏర్పడటం వంటివి జరుగుతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది.
తెగుళ్ల తీగ సాగులేక..
తెగుళ్ల తీగ సాగులేక..
తెగుళ్ల తీగ సాగులేక..
తెగుళ్ల తీగ సాగులేక..
తెగుళ్ల తీగ సాగులేక..
తెగుళ్ల తీగ సాగులేక..
తెగుళ్ల తీగ సాగులేక..


