అందారికీ ముంపే..
ఫ ఏటా వరదల సీజన్‌లో అవస్థలు
ఫ ముంపు బారిన చింతూరు – వీఆర్‌పురం ప్రధాన రహదారి
ఫ సోకిలేరు వాగుపై మరో వంతెన అవశ్యం
ఫ సుమారు 50 గ్రామాల ప్రజలకు మేలు
చింతూరు: వెతలు ‘ముంపు’కొచ్చాయి.. అవస్థలు తెచ్చిపెట్టాయి.. ఏటా వరదల సీజన్‌లో ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.. అధికారులు, పాలకులు పట్టించుకోక ప్రతి ఏడాది ప్రజలకు క‘న్నీళ్లే’ మిగులుతున్నాయి.. ప్రతి ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకూ వస్తున్న వరదలకు చింతూరు – వీఆర్‌పురం ప్రధాన రహదారిలో నాలుగైదు చోట ముంపునకు గురవుతోంది. ప్రధానంగా అన్నవరం, ఏజీకోడేరు, ముకునూరు, చూటూరు ప్రాంతాల్లో రహదారిపై నీరు చేరుతోంది. దీంతో పాటు ఈ రహదారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురికానుంది. చింతూరు మండలం సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగు, వీఆర్ పురం మండలం అన్నవరం వాగుల కారణంగా వరదనీరు రహదారిపై చేరి ఏటా నెల నుంచి నెలన్నర పాటు ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల పోలవరం ముంపునకు గురికాని గ్రామాల ప్రజలకూ అవస్థలు తప్పడం లేదు. ప్రధాన రహదారి ముంపునకు గురవుతున్న నేపథ్యంలో తమకు ప్రత్యామ్నాయంగా సోకిలేరు వాగుపై మరో వంతెన నిర్మించాలని సుమారు 50 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏటా వరదల సమయంలో చింతూరు మండలంలో 11 గ్రామాలు, వీఆర్ పురం మండలంలో 25 గ్రామాల ప్రజలు రాకపోకలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి నిత్యావసరాలు దొరకక అల్లాడుతున్నారు. దీంతో పాటు అత్యవసర సమయంలో సకాలంలో వైద్యం అందక అనేక మంది మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి కాలినడకన, ఆటోలు, పడవలపై రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి వస్తోంది. అధికారులు సైతం వరదలు తగ్గిన తర్వాత మాత్రమే ఆయా గ్రామాలకు సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ గ్రామాలకు వెళ్లలేం..
ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను ఇక్కడి నుంచి తరలించారు. ముంపునకు గురికాని గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. చింతూరు మండలం నర్శింగపేట, రామన్నపాలెం, బొడ్రాయిగూడెం, చినసీతనపల్లి, పెదసీతనపల్లి, కొండపల్లితో పాటు వీఆర్‌పురం మండలం జల్లివారిగూడెం, గుల్లేటివాడ, ములకనపల్లి, కుందులూరు, కారంగూడెం, తెల్లవారిగూడెం, పెదమట్టపల్లి, వెంకంపాలెం, ఉమ్మిడివరం తదితర గ్రామాలు ముంపునకు గురికాకుండా ఉన్నాయి. పోలవరం ముంపుతో చింతూరు, వీఆర్ పురం ప్రధాన రహదారి ముంపునకు గురైతే పై గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు దారి లేకుండా పోతోంది.
వంతెన నిర్మాణమే శరణ్యం
పోలవరం ముంపునకు గురికాని గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ప్రత్యామ్నాయంగా సోకిలేరు వాగుపై మరో వంతెన నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనిపై చింతూరు మండలం పెదశీతనపల్లి, కొల్తూరు నడుమ వాగుపై రూ 2.50 కోట్ల ఉపాధి హామీ నిధులతో వంతెన నిర్మాణం చేపట్టేందుకు గతంలో అనుమతులు మంజూరయ్యాయి. వాగుపై 50 మీటర్ల మేర వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి సర్వే కూడా చేశారు.
కాగా దీనికి పూర్తి స్థాయిలో అనుమతులు రాకపోవడంతో నేటికీ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. వర్షాకాలంలో చింతూరు, వీఆర్ పురం ప్రధాన రహదారి ముంపునకు గురైతే చాలా గ్రామాల ప్రజలు ఈ రహదారిని వినియోగిస్తూ రాకపోకలు కొనసాగిస్తున్నారు.
పూర్తయితే ఇలా వెళ్లొచ్చు
సోకిలేరు వాగుపై వంతెన నిర్మాణం పూర్తయితే పోలవరం ముంపులో లేని గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ఆయా గ్రామాల ప్రజలు వంతెన ద్వారా పెదశీతనపల్లి నుంచి కొల్తూరు దాటి అక్కడి నుంచి కంసులూరు, చదలవాడ మీదుగా తులసిపాక ప్రధాన రహదారికి చేరుకుని తర్వాత ఇతర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశముంది. మరోవైపు కొల్తూరు నుంచి వేగితోట, కారంగూడెం మీదుగా ఎర్రంపేట చేరుకుని అక్కడి నుంచి కూడా తమ ప్రయాణాలు సాగించవచ్చు. ఈ రహదారి ఎక్కడా పోలవరం బ్యాక్ వాటర్‌లో ముంపునకు గురయ్యే అవకాశం లేనందున ఆయా గ్రామాల ప్రజలకు అత్యవసర సమయాలతో పాటు ఇతర అవసరాలకు ఎంతో మేలు చేకూరుస్తుంది.
పోలవరం ముంపుతో..
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ రహదారిలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. చింతూరు మండలం ముకునూరు, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, మల్లెతోట, ఉలుమూరు గ్రామాలు తొలి కాంటూరు పరిధిలో ముంపులో ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల పరిధిలోని రహదారి సైతం నీట మునుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలకు పోలవరం పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది.
అందారికీ ముంపే..


