
సమస్యలుంటే సంప్రదించండి
● ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి, మట్కా, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. డయల్ 100, షీ టీం, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు, పోలీస్ సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు.