
పకడ్బందీగా ‘ఆరోగ్య పాఠశాల’
● ఈనెల 3 నుంచి డిసెంబర్ 31 వరకు ● కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కళాశాలల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, వైద్యశాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 250 పాఠశాలలు, 13 కళాశాలల్లో ఈ నెల 3నుంచి డిసెంబర్ 31 వరకు కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లుగా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35వేల మంది విద్యార్థులకు ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఉదయం 9.15 నుంచి 9.35 గంటల వరకు (20 నిమిషాల పాటు) రోజుకో కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. మొదటి విడత కార్యక్రమం విజయవంతమైనందున మలి విడత మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి నెలా సమీక్ష ఉంటుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారికి రూ.2లక్షల వరకు నగదు పురస్కారం అందించనున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీసీఈవో జితేందర్ రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, డీడబ్ల్యూవో మిల్కా, డీఐఈవో జాదవ్ గణేష్ కుమార్, డైట్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, ఆయుష్ విభాగాధికారి ప్రీతల్ రాథోడ్, ఆరోగ్య పాఠశాల కో ఆర్డినేటర్ అజయ్ పాల్గొన్నారు.