
ప్రజలతో సత్సంబంధాలు కీలకం
● అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వొద్దు ● జిల్లాలో నెల రోజుల పాటు 30 పోలీస్‌యాక్ట్ ● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకుంటూ పోలీసులు విధులు నిర్వర్తించాల ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో అధికారులతో మంగళవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది గ్రామాల్లో సందర్శిస్తూ ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థ పటిష్టం చేసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామానికి విలేజ్ పోలీసు ఆఫీసర్‌ను కేటాయించి వారి పేర్లు గోడలపై రాయించాలన్నారు. సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు స్టేషన్ హౌస్ అధికారి ఘట నా స్థలాన్ని పరిశీలించి సరైన దర్యాప్తు చేపట్టాలన్నారు. అప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. మంగళవారం నుంచి ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమవుతుందని, జిల్లాలో ఇద్దరు సీఐలు పద్మ, అంజమ్మ ఆధ్వర్యంలో రెండు బృందాలు పనిచేస్తాయన్నారు.ఆదిలాబాద్, ఉట్నూ ర్ డివిజన్లలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలా గే జిల్లాలో నెలరోజులపాటు 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని, అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలు చేపట్టరాదని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే రహదారి ప్రమాదాల నివారణకు రాత్రి వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు రూపుమాపే దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం గత నెలలో జరిగిన నేరాలు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్‌రెడ్డి, సీహెచ్ నాగేందర్, హసిబుల్లా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, డీసీఆర్‌బీ, ఎన్‌ఐబి, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.