
● డీఏపీ నోస్టాక్.. యూరియా పంపిణీలో వైఫల్యం ● వెరసీ కొన
సాక్షి,ఆదిలాబాద్: ఈ వానాకాలం సీజన్‌లో రైతులు ఉత్సాహంగా పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే విత్తనాలు మొలకెత్తాయి. వాటి ఎదుగుదలకు యూరి యా, డీఏపీ ఇవ్వాల్సిన ఆవశ్యకత. ఈ క్రమంలో త మకు అవసరం మేర ఎరువులు ఇవ్వాలని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడ డీఏపీ అసలుకే లభించడం లేదు. యూరియా లభిస్తున్నప్పటికీ రైతులు కోరినంత అందించని పరిస్థితి. వాస్తవానికి డీఏపీ కొరత ఉండగా, యూరి యా అందుబాటులో ఉన్నా రైతులకు పూర్తిస్థాయిలో లభించకపోవడం గమనార్హం. అధికారుల ప్ర ణాళిక లోపమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కడా వైఫల్యం..
జిల్లాకు జూన్ వరకు ఎంతమేర యూరియా అవసరమో ఇప్పటివరకు అంతకుమించి ప్రభుత్వం పంపింది. క్షేత్రస్థాయి పంపిణీలో వైఫల్యం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పీఏసీఎస్ నుంచి తమకు ఇంత ఎరువు కావాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారికి స్థానిక ఏవో రికమండేషన్‌తో ఇండెంట్ పంపుతారు. తదనుగుణంగా డీఏవో మా ర్క్‌ఫెడ్‌కు ప్రొసీడింగ్ జారీ చేయాలి. ఆ ఇండెంట్ ఆధారంగా సొసైటీలకు స్టాక్ చేరుతుంది. అయితే ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేపడతారు. ప్రధానంగా ప్రతీ ఘట్టంలో సమయం తీసుకోవడంతో పంపిణీ పరంగా జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
అడిగిన మేర ఎందుకివ్వడం లేదు..
జిల్లాకు యూరియా కోటా మించి ఇప్పటి వరకు చే రుకుంది. అయినప్పటికీ పలుచోట్ల రైతుల డిమాండ్ మేరకు బస్తాలను పీఏసీఎస్‌లు ఇవ్వడం లేదు. మరి ఈ వైఫల్యం ఎవరిదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొసైటీలు ఏమేర తమకు స్టాక్ కావా లని ఇండెంట్ పంపుతున్నారో ఆ మేర అక్కడికి యూరియా చేరడం లేదు. దానికి బజార్‌హత్నూర్ స్టాక్ ఇండెంటే నిదర్శనం. అరకొర పంపుతుండడంతో క్షేత్రస్థాయిలో రైతులకు తమ విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా దొరకని పరిస్థితి ఉంది.
డీఏపీకి ప్రత్యమ్నాయంగా..
జిల్లాకు డీఏపీ ఇప్పటివరకు కోటాలో సగం మా త్రమే అందింది. ప్రస్తుతం కేంద్రాల్లో ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి. దీంతో రైతులు ప్ర త్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులు వాడాల్సిన దుస్థితి. ప్రధానంగా డీఏపీలో నత్రజని, భాస్వరం శాతం అధికంగా ఉంటుంది. ఇది మొక్కల ఎదుగుదలకు దోహదపడుతుంది. అయితే ప్రస్తుతం ఇది దొరకని పరిస్థితి ఉండడంతో రైతులు గత్యంతరం లేక తక్కువ నత్రజని, భాస్వరం ఉండే కాంప్లెక్స్ ఎరువుల వైపు మరలుతున్నారు. ప్రత్యామ్నాయంగా వాడే ఈ ఎరువుల్లో ఒకట్రెండు డీఏపీ ధరకే లభిస్తాయి. మరికొన్ని మాత్రం అధిక ధర ఉండడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది.
ఎరువుల వివరాలు.. (మెట్రిక్ టన్నుల్లో)
ఎరువు మొత్తం కోటా జూన్ వరకు అవసరం వచ్చింది విక్రయించింది ఉన్న స్టాక్
యూరియా 35,000 17,000 25,503 10,222 15,281
డీఏపీ 13,000 13,500 8,444 8,140 304
కాంప్లెక్స్ 36,000 15,900 27,314 13,213 14,101
ఒకేసారి తీసుకెళ్తుండడంతో..
ఎదిగే పంటలకు యూరియా దఫదఫాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అన్ని దఫాలది కలిపి రైతులు ఒకేసారి కావాలని వస్తుండడంతోనే సమస్య ఎదురవుతుంది. అంతే తప్పితే యూరియా కొరత లేదు. డీఏపీ స్టాక్ రావాల్సి ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడుకోవచ్చు.
– శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి