విముక్తికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

విముక్తికి వేళాయె

Jul 3 2025 5:12 AM | Updated on Jul 3 2025 5:12 AM

విముక

విముక్తికి వేళాయె

● మొదలైన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ ● ఈనెల 31 వరకు బాల్యం బందీపై ఫోకస్‌ ● జిల్లాలో రెండు బృందాలతో తనిఖీలు ● ఇప్పటికే పలువురిపై కేసులు

బాల్యం బడులకే

అంకితం కావాలి

ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: బాలల బాల్యం బడులకే అంకితం కావాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. పోలీసు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో ఆపరేషన్‌ ముస్కాన్‌పై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో నెలరోజుల పాటు ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. చట్టవ్యతిరేకంగా బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతిరోజు తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గతేడాది పనుల నుంచి విముక్తి కల్పించిన పిల్లలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారనే వివరాలు తెలుసుకోవాలన్నారు. పిల్లలంతా బడికి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు శాఖ తరపున ఇద్దరు సీఐలతో కూడిన ప్రత్యేక బృందాలను జిల్లాలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, సీఐలు చంద్రశేఖర్‌, గుణవంత్‌రావు, పద్మ, అంజమ్మ, సీడబ్ల్యూసీ చైర్మన్‌ వెంకటస్వామి, సభ్యులు సమీర్‌ఖాన్‌, దశరథ్‌, డీసీపీఓ రాజేంద్రప్రసాద్‌, అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి రాజలింగు, వినోద్‌, సతీశ్‌కుమార్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: బాల్యం బందీ నుంచి చిన్నారులకు విముక్తి లభించడం లేదు. కేసులు నమోదు చేసినా.. జరిమానాలు విధించినా యజమానుల తీరు మారడం లేదు. ఏటా ఆపరేషన్‌ ముస్కాన్‌, ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాలతో తనిఖీలు చేపడుతున్న అధికారులు జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తున్నా షరామామూలే అన్న విధంగా మారుతోంది. పుస్తకాలతో కుస్తీ పడాల్సిన చిన్నారులు చాలా మంది రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్ల వద్ద భిక్షాటన చేయడం, హోటళ్లు, ఫ్యాక్టరీలు, బట్టల షాపులు, ఫాస్ట్‌ఫుడ్‌, సూపర్‌ మార్కెట్లలో పనులు చేస్తూ దర్శనమిస్తున్నారు. ఈ నెల 1నుంచి 31 వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ కొనసాగనుంది. రెండు రోజుల్లో 10 మందిపై లేబర్‌ యాక్ట్‌ కేసులు, మరో ఇద్దరిపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు బాలల సంరక్షణ అధికారులు చెబుతున్నారు.

వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం..

చిన్నారులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొన్నేళ్లుగా ఆపరేషన్‌ ముస్కాన్‌, ఆపరేషన్‌ స్మైల్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయినా ఇంకా పూర్తిస్థాయిలో బాలకార్మికులు విముక్తి కావడం లేదు. ప్రభుత్వం ఏటా జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చి వారి కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారు. యాచకులు, బాలకార్మికులుగా ఉన్నవారిని ఆ పనుల నుంచి విముక్తి చేసి విద్యాభ్యాసం చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈనెల 1 నుంచి ప్రారంభమైన ‘ముస్కాన్‌’ ఈనెల 31 వరకు కొనసాగనుంది. పోలీసు శాఖతో పాటు బాలల సంరక్షణ సమితి, కార్మిక శాఖ సమన్వయంతో నెల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపడతారు. గడిచిన రెండు రోజుల్లో గుర్తించిన పిల్లలను సీడబ్ల్యూసీ ముందుంచి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు.

పూర్తిస్థాయిలో నెరవేరని లక్ష్యం..!

కార్మికులు, యాచకులుగా జీవనంసాగిస్తున్న చిన్నారులను ఈ కార్యక్రమం ద్వారా గుర్తించినప్పటికీ మళ్లీ యథాస్థితికే చేరుతున్నారు. హోటళ్లు, ఇతర దుకాణ సముదాయాల్లో పనిచేస్తున్న పిల్లలను గు ర్తించి బడులకు పంపుతున్నా మళ్లీ కొంతకాలానికి తిరిగి పనుల్లోనే దర్శనమిస్తుండడం గమనార్హం. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, కొంత మంది పిల్ల లకు పేరెంట్స్‌ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంటుంది. అలాగే ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాలనుంచి తప్పిపోయి వచ్చి ఎక్కడో ఒక చోట యాచకులుగా మారి జీవనం సాగిస్తున్నారు. అయితే నెలల తరబడి పనులు చేస్తున్న చిన్నారులను పట్టించుకోని ఆయా శాఖల అధికారులు ఈ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మాత్రమే దృష్టి సారించడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన కార్మిక శాఖ, ఐసీపీఎస్‌, విద్య శాఖాధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా చేపడితేనే అనుకున్న లక్ష్యం సాధించవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో విముక్తి కలిగించిన చిన్నారుల వివరాలు..

సంవత్సరం ఆపరేషన్‌ ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా ముస్కాన్‌ ద్వారా

2017 144 147

2018 149 163

2019 62 311

2020 –– ––

2021 113 72

2022 55 41

2023 110 135

2024 65 83

2025 69 ––

విముక్తికి వేళాయె1
1/1

విముక్తికి వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement