breaking news
yadagiri lakshmi narasimha swamy
-
నేటి నుంచి యాదగిరి క్షేత్రంలో ధనుర్మాస వేడుకలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలకు సిద్ధమైంది. మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ నెల రోజులపాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు, పారాయణీకులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కైంకర్యాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర భాగం హాల్లో తిరుప్పావై వేడుకధనుర్మాస ఉత్సవ కార్యక్రమం ఆలయంలో ప్రతిరోజూ వేకువజామున 4.30 గంటల నుంచి 5 గంటల వరకు జరిపిస్తారు. శ్రీస్వామి వారి ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగంలోని హాల్లో గోదాదేవి అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం, మార్గళి నివేదన వంటి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి 14వ తేదీ రాత్రి 7గంటలకు ఆలయ ముఖ మండపంలో గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణం, 15న ఉదయం 11.30గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహిస్తారు.కైంకర్యాల్లో మార్పులు..ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయ కైంకర్యాల వేళల్లో అధికారులు మార్పులు చేశారు. మంగళవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు వేకువజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహిస్తారు. అనంతరం తెల్లవారు జామున 4గంటల నుంచి 4.30 వరకు తిరువారాధన, 4.30గంటల నుంచి 5గంటల వరకు తిరుప్పావై సేవాకాలం జరిపిస్తారు. ఉదయం 5గంటల నుంచి 6గంటల వరకు నివేదన, చాత్మర, 6గంటల నుంచి 7గంటల వరకు నిజాభిషేకం, 7గంటల నుంచి 7.45 గంటల వరకు సహస్రనామార్చన వంటి పూజలు ఉంటాయని అధికారులు వివరించారు. ఉదయం 7.45 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. నిత్య కైంకర్యాలు యథావిధిగా ఉండనున్నాయి. -
24 నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 31 వరకు జరగనున్నాయి. 24న అంకురార్పణ, 26న స్వామివారి ఎదుర్కోలు, 27న తిరుకల్యాణ మహోత్సవం, 28న దివ్య విమాన రథోత్సవం ఉంటాయని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రంగులు, సున్నాలు, చలువ పందిళ్లు వేస్తున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత ఈ నెల 31న చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నామని ఈవో వెల్లడించారు. ఆలయాన్ని ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేస్తున్నట్లు చెప్పారు. -
ఇక ఒక్కరోజే..
భువనగిరి : మహిమాన్విత స్వయంభు యాదగిరి లక్ష్మీనారసింహ స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఒక్క రోజే మిగిలింది. సీఎం కేసీఆర్ సంకల్పించిన మహోన్నత అభివృద్ధి క్రతువులో భాగంగా ఈ నెల 21 నుంచి స్వయంభువుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. వేల ఏళ్లక్రితం కొండ గుహలో వెలిసిన పంచనారసింహులను ద ర్శించుకోవడానికి అనుమతించరు. నూతనంగా నిర్మించిన బాలాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో విగ్రహాలను ప్రతిష్ఠింప జేసే కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు మంగళవారం బాలాలయంలోని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవాలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకూ భక్తులు బాలాలయంలోనే స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలి. ఈమేరకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను సంతృప్తి పరిచే విధంగా.. ప్రధాన ఆలయంలో స్వయంభూ దేవతామూర్తుల దర్శనం ఏవిధంగా ఉంటుందో అదేవిధంగా బాలాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గుహాలయం మాదిరిగా బాలాలయ నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. తూర్పు దిక్కునుంచి స్వామి వారి ఆలయంలోకి ప్రవేశించేలా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయం మాదిరిగానే ఆండాల్ అమ్మవారి అల యం నిర్మించారు. రామానుజ కూటమి, స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి బాలాలయంలోనే స్వామి అమ్మవార్ల దర్శనాలు ఉంటాయని ఇప్పటికే విస్తృతంగా జరిగిన ప్రచారం నేపథ్యంలో ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు ఎగబడ్డారు. బాల ఆలయంలో చినజీయర్ స్వామి ఆధ్వర్వంలో ఉత్సవ మూర్తులకు ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.


