breaking news
West Indies players
-
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్‌కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్‌ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్‌ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
కలిసి...మెలిసి... అతిక్రమించారు!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటన కోసం వచ్చిన వెస్టిండీస్ ఆటగాళ్లు కరోనా వైరస్ ప్రొటోకాల్‌ను విస్మరించారు. క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు నిబంధనల్ని అతిక్రమించి ప్రవర్తించడం న్యూజిలాండ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. 14 రోజుల క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు తాము బస చేసిన హోటల్లో ఏ మాత్రం భౌతిక దూరం పాటించలేదు. పైగా భోజనాల సమయంలో ఒకరి ప్లేట్లోని పదార్థాల్ని ఇంకొకరు పంచుకున్నారు. ఇవన్నీ హోటల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీనిపై కివీస్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం 12 రోజుల క్వారంటైన్ పూర్తయినప్పటికీ... ఈ అతిక్రమణ వల్ల కరోన పరీక్షల్లో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్ వ్యవధిని పొడిగిస్తారు. కరీబియన్ క్రికెటర్లు నిబంధనలకు విరుద్ధంగా కలిసిమెలిసి తిని తిరిగిన వీడియో ఫుటేజీలను విండీస్ బోర్డుకు పంపించామని కివీస్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. -
వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆ జట్టు ఆటగాళ్లకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి మద్దతు లభించింది. వారి ఆవేదనను బోర్డు పట్టించుకోవాలని సూచించారు. ‘మైదానం బయట, లోపల సవాళ్లను ఎదుర్కొంటూ వెస్టిండీస్ ఆటగాళ్లు నిజమైన చాంపియన్లుగా నిలిచారు. ఈ సమయంలో విండీస్ బోర్డు తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలి’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.