సీనియర్స్ డియర్స్
ఇంతలా సంతాపసభ జరుగుతోంది? చనిపోయిన వ్యక్తి రాజకీయనాయకుడా? లేదా సెలబ్రిటీనా? ఇంత అభిమానంతో అంజలి ఘటిస్తున్న ఈ వృద్దులంతా ఎవరై ఉంటారు? ఫొటో చూసిన అందరికీ వచ్చే సందేహం ఇది. కానీ కాలంచేసిన పెద్దాయనకు వాళ్లు బంధువులు కాదు, చనిపోయిన వ్యక్తి ఏ నాయకుడో కాదు. మరి వీరికి ఆ స్వర్గీయుడికి ఉన్న బంధం ఏంటంటే...‘వి ఆర్ ఆల్ సినీయర్ సిటిజన్స్... మేం మాకోసం, సమాజం కోసం’ అని సమాధానమిస్తారు. ఆటలు, పాటలు, ఆరోగ్యం, అనుబంధంతోపాటు ఒక పండుటాకు రాలినపుడు వారు స్పందించేతీరుకి ఈ సంతాపసభ స్వచ్ఛమైన నిదర్శనం. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీ ‘సీనియర్ సిటిజన్స్’ చెప్పిన కబుర్లే ఈవారం సిక్ట్సీప్లస్.
-భువనేశ్వరి
అప్పటివరకూ వారిమధ్యలో తిరిగిన మనిషి మంచానపడ్డా, మరణించినా మేమున్నాం మిత్రమా అంటూ ముందుకెళ్లే ఈ జ్యేష్ఠ పౌరులు జరిపే ప్రతి కార్యక్రమం వారికోసం మాత్రమే కాదు.. సమాజం కోసం కూడా. ‘మంచినీటి కేంద్రాల నుంచి మున్సిపాలిటి పాలన వరకూ అన్ని సమస్యలపై పోరాడుతున్నాం. రిటైర్డ్ పర్సన్స్ కదా... నలుగురు ఒకదగ్గర కూడితే ఏదో ఊసుపోని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారనుకుంటే పొరపాటు.
మాలో అన్ని రంగాలకు చెందిన అధికారులూ ఉన్నారు. వారి అనుభవాల్ని నలుగురికీ చెప్పడంతో పాటు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సలహాలు కూడా అందిస్తున్నాం’ అని చెప్పారు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉప్పలగోపాలరావు. వీధిలో కరెంటు స్తంభం లైటు వెలగకపోతే ఎవరు ఫిర్యాదు చేయాలి? మామూలుగా మన వేలు యువతవైపు వెళుతుంది. కానీ ఇక్కడ ఆ పని చేస్తుంది వృద్ధులు. ఇక్కడ కాలనీకో అసోసియేషన్ ఉండడం వల్ల ఆ కాలనీ బాగోగులన్నీ వారే చూసుకుంటున్నారు.
పద్నాలుగు కాలనీలు...
కూకట్పల్లి చాప్టర్ కిందున్న పద్నాలుగు కాలనీలలో పద్నాలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. వారంతా వివేకానందానగర్కాలనీలోని సినీయర్ సిటిజన్స్ సంఘాల సమాఖ్యలో జీవితకాల సభ్యత్వం తీసుకున్నవారు. ‘మా అసోసియేషన్‌లో 140 మంది వృద్ధులు సభ్యులుగా ఉన్నారు. తలో వెయ్యి రూపాయలు వేసుకుని లైఫ్‌టైం మెంబర్షిప్ తీసుకున్నాం. ఆ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీ డబ్బులతో మా కార్యక్రమాలు సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో పుట్టినరోజులు, సంతాపసభలు, డాక్టర్స్‌డే, టీచర్స్‌డే... అన్నీ జరుపుకొంటాం. అసోసియేషన్ ఫౌండర్ అయిన డాక్టర్ సబ్బిన సత్యనారాయణ గారు ఈ మధ్యనే మరణించారు. సంతాపసభ నిర్వహించుకుని ఈ సందర్భంగా ఆయన స్మృతులను నెమరువేసుకుంటున్నాం’ అని చెప్పారు వైస్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి.
విహారయాత్రలకు...
గత ఏడాది భాగ్యనగరికాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్‌లోని ఓ ఇరవైమంది విహారయాత్రకు వెళ్లొచ్చారు. ‘శ్రీశైలం, కాళహస్తి... ఓ నాలుగైదు ప్రదేశాలు తిరిగొచ్చాం. దారిపొడవునా చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ, మారిన కాలాన్ని వర్ణించుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాం. మా కాలనీవారికి విహారయాత్రలంటే కాస్త మక్కువెక్కువ’ అని చెప్పారు హెచ్‌సిఎల్‌లో రిటైర్డ్ అయిన ఎ.ఆర్.కె చౌదరి. ఆయనతో మాటకలుపుతూ ‘నెక్ట్స్ మేమంతా పంచారామాలు వెళదామనుకుంటున్నాం’ అని అన్నారు ట్రెజరర్ రోషిరెడ్డి.
ఇదే సరైన సమయం...
‘చిన్నప్పుడు చదువులు, తర్వాత ఉద్యోగాలు... ఆ తర్వాత కుటుంబం, బాధ్యతలు. ఇంకెప్పుడు సమాజం కోసం నాలుగు నిమిషాలు ఆలోచించేది అని ప్రశ్నించుకుంటే కరెక్టు వయసు 60 సంవత్సరాల తర్వాతే. ఈ మాటకు రుజువు మేం చేసుకుంటున్న, చేస్తున్న పనులే నిదర్శనం. ఇప్పటివరకూ ప్రపంచంతో సంబంధం లేకుండా హడావుడి జీవితం గడిపాం. ఇప్పుడు అడుగులో అడుగువేసుకుంటూ వీధిలో కాసేపు నడిచే సమయం దొరికింది. కావాల్సినవారిని పలకిరిస్తూ, ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేస్తూ, సమాజంలో వస్తున్న మార్పుల్ని గమనిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నాం’ అని చెబుతున్నారు ఉప్పల గోపాల్‌రెడ్డి. ‘అంతేకాదు... మా ఆలోచనలను సమాజంతో పంచుకునే అవకాశం కూడా ఇప్పుడే బాగా ఉంటుంది. అందుకే నేను పసిపిల్లల నుంచి వృద్ధులవరకూ అందరికీ ఉపయోగపడే ‘చేతన’ అనే మాసపత్రిక ప్రచురిస్తున్నాను’ అని చెప్పారాయన.
ప్రతి నెలా హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించుకుంటున్నారు. ఇక మానసిక చైతన్యం కోసం ఈ సీనియర్ సిటిజన్స్ సీరియస్ స్లోగన్...‘ఎల్డర్స్ ఫర్ ఎల్డర్స్, ఎల్డర్స్ ఫర్ సొసైటీ, సొసైటీ ఫర్ ఎల్డర్స్’. విశ్రాంతి తీసుకునే సమయంలో మరింత ఉత్సాహంతో ఈ సీనియర్ సిటిజన్స్ వేస్తున్న అడుగులు నేటి అందరికీ అడుగుజాడలు.
మీరూ పంపండి..
యాభై దాటితే సగం జీవితం అయిపోయినట్టేనా?.. ‘కాదు.. జస్ట్ బిగిన్’ అంటున్నారు సీనియర్ సిటిజన్స్. ఆటపాటలు.. ఇష్టమైన వ్యాపకాలతో స్నేహిస్తూ.. కాసింత చారిటీకి టైమిస్తూ జీవితాన్ని ‘కొత్త బంగారు లోకం’ చేసుకుంటున్న సీనియర్ సిటి‘జెమ్స్’ ఎందరో!. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అని చాటుతున్న అటువంటి వారికి విజ్ఞప్తి.. మీ అసోసియేషన్ లేదా వృద్ధాశ్రమాల యాక్టివిటీస్ గురించి మాకు రాసి పంపండి. మీ ఎక్స్పీరియన్స్ మరెందరికో ఇన్స్పిరేషన్.
మెయిల్: sakshicityplus@gmail.com