breaking news
Water management board
-
కావేరి బోర్డుపై న్యాయ పోరాటం
సాక్షి బెంగళూరు: కావేరి నది నీటి నిర్వహణ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం విధానసౌధలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సీనియర్ అధికారులు కర్ణాటక తరఫు వాదనలు వినిపించాలని తీర్మానించారు. అన్ని పార్టీల ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని నిర్ణయించారు. సమావేశంలో అన్ని పార్టీల నేతలతో పాటు కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్ పాల్గొన్నారు. భేటీ అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు. ‘కావేరీ నిర్వహణ ప్రాధికార సంస్థ, నియంత్రణ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో బోర్డును హడావుడిగా నియమించాల్సిన అవసరం లేదని మాత్రమే మేం చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో కర్ణాటక ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వాదనలను, రైతుల నీటి కష్టాలను వివరిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తమ న్యాయ నిపుణులు మోహన్ కటార్కి, ఫాలి నారిమన్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పాల్గొన్నారు. -
మీకు న్యాయం చేస్తాం : సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జలాల వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను కేంద్రం పట్టించుకోవట్లేదని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. సోమవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ‘తమిళనాడుకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని భరోసా ఇచ్చింది. ‘తమిళనాడు సమస్య మాకు అర్థమైంది. కావేరీ జలాల విషయంలో సత్వర న్యాయం జరిగేలా చూస్తాం’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తెలిపారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటును కోరుతూ గతకొన్ని రోజులుగా తమిళనాడుకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం ఈ అంశంపై కేంద్రం స్పందిస్తూ... ‘ఇది చాలా సున్నితమైన అంశమని.. పైగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు ఉన్నందున నిర్ణయం తీసుకోలేకపోతున్నామని’ సుప్రీంకోర్టుకు నివేదించింది. కాగా, ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు కావేరీ జల వివాదంపై తీర్పునిస్తూ.. తమిళనాడు వాటాను తగ్గించి, కర్ణాటక రాష్ట్రానికి అధిక వాటాను కేటాయించింది. బెంగుళూరు సిటీ అవసరాల దృష్ట్యా ఈ తీర్పునిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆ సమయంలో పేర్కొన్నారు. -
జెన్కో విద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకి!
‘విద్యుత్తు’ విభజనపై ముసాయిదా ప్రతిపాదనలివ్వండి ఇంధన శాఖ అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశం సాక్షి, హైదరాబాద్: జెన్కోకు చెందిన జలవిద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకి పోనున్నాయా? నీటి నిర్వహణ బోర్డు పరిధిలోకి రానుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై ఇప్పటికే నీటి బోర్డుల ఏర్పాటు గురించి రాష్ట్ర పునర్విభజన బిల్లులో ఉంది. దీంతో ఈ నదులపై జెన్కోకు చెందిన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులి చింతల తదితర ప్రాజెక్టులన్నీ ఆ బోర్డుల పరిధిలోకే రానున్నట్లు సమాచారం. ఇదే విషయమై బుధవారం జరిగిన ఇంధనశాఖ సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఆయా విద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకి వెళ్తే వాటి నిర్వహణ ఎలా ఉంటుందనే విషయమై, అలాగే జెన్కో, ట్రాన్స్‌కోలను ఎలా విభజిం చాలనే దానిపై ముసాయిదా ప్రతిపాదనలు రెండు, మూడు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాహూ ఆదేశించారు. అయితే, విద్యుత్ సంస్థలు సూచించిన ప్రతిపాదనల్లో తలెత్తే ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై ముసాయిదా ప్రతిపాదనల అనంతరం చర్చిద్దామని సాహూ అన్నట్టు తెలిసింది. జెన్కోను ప్లాంట్ల వారీగా విభజించినప్పటికీ ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇంకా ఆర్డినెన్స్ జారీ కాలేదు. దీంతో సీలేరు విద్యుత్ ప్లాంటును ఏ ప్రాంతంలో చూపించాలనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆర్డినెన్స్ వచ్చాక దీనిపై నిర్ణయానికి వద్దామని అధికారులు భావిస్తున్నారు. అలాగే ట్రాన్స్‌కోను విద్యుత్ సరఫరా లైన్లు ఆధారం గా విభజించాలా, లేదా సబ్స్టేషన్ల వారీగానా అనే విషయంపైనా చర్చ జరిగింది. ఏ విధానం సరైనదనే విషయంపై ప్రతిపాదనలు ఇవ్వాలని సాహూ అధికారులను కోరారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఫైళ్లను వేర్వేరుగా విడదీయాలని, ఇరు ప్రాంతాలకు సంబంధించిన ఫైళ్లను మాత్రం రెండు కాపీలు తీసి భద్రపరచాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఫైళ్లను సంబంధిత అధికారితో ధ్రువీకరణ చేయించాలని సూచించారు. ఏపీపీడీసీఎల్ ఎక్కడ? రాష్ట్ర విభజనతో ఉద్యోగుల్లో వేడి పెరుగుతోంది.. ఎవరు ఎక్కడకు వెళ్లాలనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే మొత్తం ప్రక్రియలో తమ కంపెనీ పేరే కనిపించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) ఉద్యోగుల్లో కలకలం చెలరేగుతోంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం వద్ద 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ ప్లాంట్లను చేపట్టేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. ఆ ప్లాంట్లలో మొదటిదానిలో నెలాఖరులోగా విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. మరో 6 నెలల తర్వాత మరో ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇవేగాక మరో 800 మెగావాట్ల ప్లాంటును చేపట్టాలనీ నిర్ణయించారు. ఈ సంస్థ జెన్కోతోపాటు రాష్ట్రంలోని 4 విద్యుత్ పంపిణీ సంస్థలకు వాటా ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఎర్రగడ్డలో జెన్కోకు చెందిన భవనంలో ఉంది. దీనిలో అనేకమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, ఈ కంపెనీ పేరు బిల్లులో ఎక్కడా లేకపోవడం వారిలో కలవరం రేపుతోంది. తాము ఏ ప్రాంతానికి చెందుతామని, తమను ఎలా విభజిస్తారోనని ఆందోళన చెందుతున్నారు.