దొంగగా మారిన ఆర్ఎంపీ
- అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు
- రూ.9 లక్షల సొత్తు స్వాధీనం
- పరారీలో మరో నిందితుడు
వరంగల్ క్రైం : వైద్యంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఓ ఆర్ఎంపీ దొంగగా మారాడు. అన్న, తమ్ముడి వలే చోరీల బాట పట్టిన వైద్యుడిని పోలీసులు కటకటాల్లోకి పంపి రూ.9లక్షలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం రామారం గ్రామానికి చెందిన రాంటెంకి రాజ్‌కుమార్ ఉరఫ్ రాజు ఆర్ఎంపీగా పనిచేస్తుండేవాడు. అతడి అన్న శ్రీనివాస్, తమ్ముడు సారయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేసేవారు.
గతంలో ఆదిలాబాద్, కరీంనగర్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లిన వారిద్దరు మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆర్ఎంపీగా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజ్‌కుమార్ కూడా దొంగతనాలకు పాల్పడాలనే ఆలోచనకు వచ్చాడు. తమ్ముడు సారయ్యతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. ఇద్దరు కలిసి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొంగతనాలు చేశారు. సుమారు 18 దొంగతనాలు చేయగా ఇందులో 8 తాళం వేసిన ఇళ్లలో.. మరో 10 చోరీలు మహిళల మెడలో చైన్‌స్నాచింగ్‌లు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు.
రాజ్‌కుమార్ చోరీ సొత్తును బుధవారం వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్ముకునేందుకు రాగా సమాచారం అందుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.9 లక్షల విలువైన 442 గ్రాముల బంగారం, వంద గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సారయ్య పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకున్న సీసీఎస్, మట్టెవాడ సీఐలు ఎస్ఎం.ఆలీ, ఆదినారాయణ, ఎస్సై లక్ష్మీనారాయణ, హెడ్‌కానిస్టేబుళ్లు వీరస్వామి, శివకుమార్, కానిస్టేబుళ్లు మహేశ్, జంపయ్య, రమాకాంత్, మట్టెవాడ కానిస్టేబుళ్లు రమేశ్, బాలకృష్ణను ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు.