breaking news
Venkateswarao
-
కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి.. సైకిలెక్కేశారు
విలువలకు పాతర...పదవులకు పాకులాట బుద్ధప్రసాద్‌కు అవనిగడ్డ ? పిన్నమనేనికి ఏదో ఒకటి! సాక్షి ప్రతినిధి,విజయవాడ : విలువలు.. విశ్వసనీయతకు చెల్లుచీటీ రాసేసి పదవే పరమావధిగా జిల్లాలో కీలక నేతలు ఇద్దరూ కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి సైకిలెక్కేశారు. అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌ను నమ్ముకుంటే పదవులు దక్కవనే ఆలోచనతో వాళ్లు పార్టీ ఫిరాయించడంపై ఆయా నియోజకవర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. వారి తండ్రుల కాలం నుంచి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా తెచ్చుకున్న మంచి పేరు కాస్తా పార్టీ ఫిరాయింపుతో పోగొట్టుకున్నారన్న విమర్శలు రేగుతున్నాయి. గాంధేయవాది కృష్ణారావు... మండలి బుద్ధప్రసాద్ తండ్రి మండలి వెంకట కృష్ణారావు గాంధేయవాదిగా గుర్తింపు పొందడంతో పాటు ఎంత కష్టమొచ్చినా కాంగ్రెస్‌ను వీడలేదు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1957లో కృష్ణారావు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం 1962లో కూడా లోక్‌సభకు ఇక్కడి నుంచే పోటీచేసి ఓటమి చవిచూశారు. 1972లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఆయన అవనిగడ్డ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 1978, 1983 వరుస ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు. 1983లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచినప్పుడు కూడా ఆయన గెలుపొందడం విశేషం. ఎమ్మెల్యేగా అవనిగడ్డ నుంచి హ్యాట్రిక్ సాధించిన మండలి వెంకట కృష్ణారావు పలుమార్లు మంత్రి పదవులను నిర్వహించారు. జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో మండలి కృష్ణారావు మంత్రిగా పనిచేశారు. జై ఆంధ్ర ఉద్యమంలోను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న ఆయన ఉద్యమకారుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా మండలి వెంకట కృష్ణారావు తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఉనికి కోసం పాట్లు... వెంకట కృష్ణారావు వంటి రాజకీయ నేతకు వారసుడిగా వచ్చిన మండలి బుద్ధప్రసాద్ పదవుల కోసం పార్టీ ఫిరాయించడం, ఉనికి కోసం కునికిపాట్లు పడటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1999, 2004 ఎన్నికల్లో రెండు పర్యాయాలు వరుస విజయాలు సాధించిన మండలి బుద్ధప్రసాద్ 2009 ఎన్నికల్లో అంబటి బ్రాహ్మణయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారం చేపట్టడంతో.. ఓడిపోయినప్పటికీ బుద్ధప్రసాద్‌కు తగిన గుర్తింపు లభించింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కలిగిన అధికార భాషా సంఘం చైర్మన్ పదవిని ఇచ్చింది. కాంగ్రెస్‌లో పదవులను ఎంజాయ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనని గుర్తించారు. అంతే గత కొద్ది రోజులుగా పావులు కదిపిన ఆయనకు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పార్టీ ఫిరాయించారు. గతనెల 27న విజయవాడలో చంద్రబాబు నిర్వహించిన మహిళా గర్జనలో బుద్ధప్రసాద్ చేరాల్సి ఉంది. అప్పుడు రాజ్యసభ సభ్యుడు గరికిపాటి రామ్మోహన్రావు ఫోన్ చేసి బ్రేక్ వేయడంతో ఆలస్యంగానైనా బుద్ధప్రసాద్ హైదరాబాద్ వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముత్తంశెట్టికి హ్యాండిస్తారా? టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్‌కు అవనిగడ్డ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు బాబు హామీ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే సీటు ఇస్తామంటూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఖర్చులు పెట్టించిన ముత్తంశెట్టి కృష్ణారావును నమ్మించి మోసగిస్తారా అనే అనుమానాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. నోవా విద్యా సంస్థల అధిపతిగా ఉన్న ముత్తంశెట్టి ఎమ్మెల్యే పదవిపై మోజుతో చంద్రబాబు ఆమోదంతో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌గా క్యాడర్‌ను చక్కబెట్టుకుంటున్నారు. మొదట్లో ముత్తంశెట్టిని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా స్థానిక సమరంలో అభ్యర్థుల ఖర్చు ఆయనే పెట్టుకుని క్యాడర్‌ను బుజ్జగించుకుంటున్న తరుణంలో తీరుబడిగా పార్టీలో చేరి ఎమ్మెల్యే టిక్కెట్ ఎగరేసుకుపోయేలా బుద్ధప్రసాద్ రావడం ముత్తంశెట్టి అనుచరులకు మింగుడు పడటంలేదు. శ్రీహరిప్రసాద్‌ను కాదని.. అవనిగడ్డలో అంబటి బ్రాహ్మణయ్యపై సానుభూతిని ఓట్లుగా మలుచుకునేందుకు ఆయన కుమారుడిని ఎన్నికల్లో దించి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న టీడీపీ అంబటి శ్రీహరిప్రసాద్‌ను కాదని ముత్తంశెట్టిని రంగంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ముత్తంశెట్టికి చెయ్యిచ్చి బుద్ధప్రసాద్‌కు పచ్చకండువా కప్పేసింది. అవనిగడ్డ కాకుంటే బందరు నుంచి బుద్ధప్రసాద్‌ను పోటీకి దించేలా మరో ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా బుద్ధప్రసాద్ కుటుంబానికి కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని పదవుల కోసం టీడీపీ పంచన చేరిపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. పిన్నమనేనికి ఏదో ఒకటి చేస్తారంట... టీడీపీలో చేరితే ఏదోక అవకాశం రాకపోదనుకున్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సైతం 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. మూడు పర్యాయాలు జెడ్పీ చైర్మన్ పదవిని చేపట్టిన పిన్నమనేని కోటేశ్వరరావు రెండు పర్యాయాలు ముదినేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కుమారుడిగా పిన్నమనేని వెంకటేశ్వరరావు 1989, 1999, 2004లో ముదినేపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు 2004లో వైఎస్ క్యాబినెట్లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కృష్ణా జిల్లా కేంద్ర సహకార (కేడీసీసీ) బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని ఆయన పదవుల కోసం టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతానికి ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ హామీ ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ కోసం పనిచేస్తే ఏదో ఒక పదవి ఇస్తారనే ధీమాతో పిన్నమనేని వెంకటేశ్వరరావు వ్యూహాత్మకంగా పార్టీ ఫిరాయించేయడం కొసమెరుపు. -
‘కొండ’ంత ఆశకు ‘కృష్ణ’పక్షం..!
ఎన్నికలు సమీపించే కొద్దీ తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ పార్టీలో నాయకుల నడుమ టిక్కెట్ల సిగపట్లు కార్యకర్తలను, ద్వితీయశ్రేణి నాయకులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. శత్రువుతో యుద్ధానికి శక్తియుక్తులన్నీ వినియోగించాల్సిన వేళ.. తలెత్తుతున్న ‘అంతర్యుద్ధాలు’ పార్టీని మరింత బలహీనపరుస్తాయని వారు దిగాలు పడుతున్నారు. సాక్షి, కాకినాడ :‘కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు పార్టీ అధినేత ఝలక్ ఇవ్వనున్నారా?’ అంటే ‘అవుననే’ ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్లుగా టిక్కెట్ తనకే ఖాయమైందంటూ ప్రచారం చేసుకున్న కొండబాబుకు ఈసారి ఆ చాన్స్ దక్కే ఆశలు అడుగంటినట్టేనని చెపుతున్నాయి. వరుసగా రెండుసార్లు ఓటమి చెందడంతో పాటు ప్రజల్లోనూ, పార్టీలోనూ వనమాడి పట్ల ఉన్న వ్యతిరేకతను సాకుగా చూపి ఆ పార్టీ అధినాయకత్వం ఆయన్ని ఈసారి పక్కన పట్టేందుకు సిద్ధపడినట్టు తెలియవచ్చింది. గతంలో టీడీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ పేరు అనూహ్యంగా తెరపైకి రావడంతో.. ఇప్పటి వరకూ కొండబాబు పెంచుకున్న ఆశలు ‘కృష్ణపక్ష చంద్రుని’లా నానాటికీ క్షీణిస్తున్నట్టేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. ముత్తాకు టీడీపీ టికెట్ ఖరారైందంటూ ఆయన వర్గీయులు ఇప్పటికే చాపకింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. ఇన్నాళ్లూ తన కుమారుడు శశిధర్‌కు టికెట్ కోసం పట్టుబట్టిన గోపాలకృష్ణ తానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల మీడియా ముందుకొచ్చిన ముత్తా తాను లేదా తన కుమారుల్లో ఎవరో ఒకరు ఈసారి ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన అభ్యర్థించినట్టు శశిధర్‌కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినచంద్రబాబు.. ఆయన అభ్యర్థిత్వంపై మాత్రం సుముఖత ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ముత్తాకున్న అనుభవాన్ని పార్టీకి ఉపయోగించుకోవాలన్న తలంపుతోనే చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఇన్నాళ్లూ ధీమాతో ఉన్న వనమాడికి ఈసారి టిక్కెట్ హుళక్కేనన్న ప్రచారం జోరందుకుంది. తిరుగుబాటు తప్పదంటున్న ‘వనమాడి’ వర్గం టిక్కెట్ ఖాయమన్న ధీమాతో ముత్తా ప్రచారానికి సైతం ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. శుక్రవారం చంద్రబాబును కలిసిన ముత్తా అధినేత ఇచ్చిన హామీతోనే ఈ నెల 12వ తేదీన ఉదయం 10.50 గంటలకు తన ఇంటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుంటున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ తాజా పరిణామం కొండబాబుకు శరాఘాతంగా మారింది. అధినేత వైఖరిపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. గత పదేళ్లుగా పార్టీ జెండా మోసిన కొండబాబును కాదని అసలు పార్టీలో ఉన్నారో, లేరో కూడా తెలియని ముత్తాకు ఏ విధంగా టిక్కెట్ ఇస్తారంటూ రుసరుస లాడుతున్నారు. పదేళ్ల క్రితమే పార్టీని వీడిన ముత్తా గత ఐదేళ్లుగా రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారని, 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కనీస ప్రభావం కూడా చూపని ఆయనకు ఏ విధంగా టిక్కెట్ కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. ముత్తాకు టికెట్ ఖాయమైతే తామంతా తిరుగుబాటు జెండా ఎగురవేస్తామని హెచ్చరిస్తున్నారు. మరొక పక్క వరుసగా మూడుసార్లు అవకాశమిచ్చినప్పటికీ పార్టీని పటిష్టపర్చాల్సిన వనమాడి పార్టీని భ్రష్టు పట్టించారని ముత్తా అనుచరులంటున్నారు. అడుగడుగునా భూ కబ్జాలను ప్రోత్సహించడంతో పాటు తోడు కొండబాబు తీరుతో విసుగు చెందడం వలనే తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నేతలు, క్యాడర్లో అత్యధికులు వైఎస్సార్ కాంగ్రెస్ సిటీ కోఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెంట నిలిచారు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేస్తున్న పార్టీ అధిష్టానం కొండబాబు అభ్యర్థిత్వంపై పునరాలోచన లో పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ తనకు అనుకూలంగా మలచుకొన్న ముత్తా సీటు కోసం అధినేత వద్ద చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు చెబుతున్నారు. కొండబాబు తన ఒంటెత్తు పోకడలతో చివరకు తన సీటుకే ఎసరు పెట్టుకున్నారని ఆ పార్టీ క్యాడరే వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. కాకినాడ సిటీ సీటు కోసం జరుగుతున్న అంతర్యుద్ధం.. అసలే దుర్బలంగా ఉన్న పార్టీని మరింత కుదేలు చేస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.