breaking news
University of Sri Krishna Deva Raya
-
వైఎస్సార్ విద్యార్థి నాయకులనే టార్గెట్ చేస్తున్నారు
► ఆందోళన చేసింది సాధారణ విద్యార్థులే ► మెస్ బిల్లుల భారం తగ్గించండి ► వీసీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వినతి ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 21న సాధారణ విద్యార్థులు మాత్రమే ఆందోళన చేస్తే వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులనే టార్గెట్ చేస్తూ 11 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ అనంతపురం జిల్లా కమిటీ కన్వీనర్ బి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కేసుల నమోదును నిరసిస్తూ ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌ను సోమవారం ఆయన కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. వర్సిటీ యాజమాన్యంను సంప్రదించకుండా పోలీసులు నేరుగా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. వర్సిటీల్లోని హాస్టల్స్‌లో మెస్‌బిల్లుల భారం అధికమవుతోందన్నారు. ఉద్యోగులు అవినీతికి పాల్బడ్డమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అధ్యాపకులకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలు ఇప్పించి వారిలో నైపుణ్యాలు పెంపుదల చేయాలన్నారు. వీసీ స్పందిస్తూ గతంలో విద్యార్థి నాయకుల మీద కేసులున్న సంగతి తనకు తెలియదన్నారు. ఎస్కేయూ పురోగతికి ప్రతి విద్యార్థి సహకరించాలని కోరారు. డ లీగల్ సెల్ కమిటీ సభ్యులు ఆదినారాయణ, విద్యార్థి విభాగం నాయకులు లింగా రెడ్డి, సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీకి బాలారిష్టాలు !
శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అన్నీ హంసపాదులే ప్రత్యామ్నాయంగా అడ్హాక్ పోస్టుల భర్తీ యోచన ఎస్కేయూలో ఉద్యోగాల భర్తీకి బాలారిష్టాలు పట్టిపీడిస్తున్నాయి. తమవారికి ఉద్యోగాలు రాలేదన్న అక్కసుతో కొందరు.. రాజకీయాలతో మరికొందరు కలిసి ఉన్నత విద్యకు పాతరేస్తున్నారు. ఫలితంగా ఏడేళ్లుగా ఎస్కేయూలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు. ఇదిలా ఉండగా విద్యార్థుల సంఖ్యను బట్టి 500మంది బోధనా సిబ్బంది ఉండాలని నాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) చెబుతుండగా.. ప్రస్తుతం కనీసం 110 మంది కూడా లేరు. ఇలాంటి తరుణంలో ఏ గ్రేడ్ ఎలా సాధ్యమంటోంది నాక్. ఎస్కేయూ :‘మీ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే 500 మంది (ప్రొఫెసర్, అసోసియేట్,అసిస్టెంట్) బోధనా సిబ్బంది ఉండాలి. ఇప్పుడు 110 మంది కూడా లేరు. ఇలా అయితే మీకెప్పటికీ ‘ఏ’గ్రేడ్ లభించదు. గతంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పర్యటనకు వచ్చిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) చేసిన సూచన ఇది. అయితే ఎస్కేయూలో కుళ్లు రాజకీయాల మూలంగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసి వర్సిటీకీ ‘ఏ’గ్రేడ్ తీసుకురావాలన్న లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. ఏడేళ్ల క్రితం చివరి నోటిఫికేషన్ : గత వీసీ ఆచార్య పి.కుసుమకుమారి హయాంలో 2009 ఫిబ్రవరిలో ఎస్కేయూలో 29 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సాధారణ నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు జరిగాయి. 2009లో ఫిబ్రవరిలోనే సబ్జెక్టులకు బట్టి నిర్ధారించిన రోస్టర్‌కు పాలకమండలి ఆమోదం, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ ఆమోదం, హైకోర్టు అనుమతి లభించింది. ఈ నియామకాల విషయంలో రోస్టర్ సక్రమంగా పాటించలేదనే కారణంతో కొందరు హైకోర్టును ఆశ్రయించి ఇప్పటికే అనుమతి పొందిన 160 ఉద్యోగాల భర్తీ అటకెక్కించించారు. 1985 నుంచి రోస్టర్ మార్పులు: ఎస్కేయూ రోస్టర్ విధానం మొదటి నుంచి పరిశీలిస్తే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1985లో ఒక ప్రొఫెసర్‌కు 11వ రోస్టర్ పాయింటును ఫిక్స్ చేశారు. కానీ అదే ప్రొఫెసర్‌కు అదే సంవత్సరం 18వ రోస్టర్ పాయింట్‌ను మార్చారు. అదే ఏడాదిలోనే మరో ప్రొఫెసర్‌కు 10వ రోస్టర్ పాయింటును ఫిక్స్ చేసి 1987లో అతనికి 34వ రోస్టర్ పాయింట్‌కు మార్చారు. ఈ ఇద్దరిలో ఒక ప్రొఫెసర్ ఎస్కేయూ రిజిస్ట్రార్‌గా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా అసలు రోస్టర్ పాయింట్లు లేకుండానే కొందరు ఏళ్ల తరబడి ప్రొఫెసర్లుగా కొనసాగుతున్నారు. నూతన పాలకమండలి దృష్టి సారిస్తే..: సుదీర్ఘకాలం తర్వాత పాలకమండలి సభ్యుల నియామకం చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పిదాలపై దృష్టి సారిస్తే మంచిదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. బోధన పోస్టుల భర్తీ చేయడానికి గల సాధ్యాసాధ్యాలు, అవసరమైన పోస్టుల సంఖ్యను తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో క్రమబద్ధీకరణ కమిటీని ఐదుగురు మాజీ వీసీలతో ఏర్పాటు చేశారు. ఎస్కేయూకు పర్యటించి ఆ కమిటీ 99 పోస్టులు అవసరమని తేల్చింది. వీటిని రెండు దఫాలుగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే వీటిని భర్తీ చేయడానికి హైకోర్టులో ఉన్న కేసుల్ని అధిగమించాల్సి ఉంది. 1985 నుంచి మారిన రోస్టర్ పాయింట్లు సరిచేసి నూతన నోటిఫికేషన్లో ఆయా పోస్టులకు రోస్టర్ పాయింట్లు ఎలా నిర్ధారిస్తారన్నదే అంతుబట్టని అంశంగా వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎస్కేయూ యాజమాన్యం బోధన పోస్టుల కొరత నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభించింది. వీలైనంత త్వరగా హైకోర్టు కేసులను అధిగమించడంతో పాటు అవసరమైన మేరకు అడ్హాక్ ఉద్యోగాల భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు. యూజీసీ బేసిక్ జీతం కొత్తగా నియమించే అడ్హాక్ లెక్చరర్లుకు ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో నాక్ కమిటీ పర్యటించనున్న నేపథ్యంలో గ్రేడింగ్ మెరుగుపరచుకోవాలని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేడింగ్ పెరిగి తద్వారా వర్సీటీకి నిధులు రావాలని ఆశిద్దాం.