breaking news
un eligible
-
51మంది ఆ పోస్టులకు అనర్హులు
సాక్షి, కడప : జిల్లాలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులకు ఎంపికైన వారిలో 51 మందికి తగిన విద్యార్హతలు లేవని గుర్తించారు. వీరిని అనర్హులుగా అధికారులు ధ్రువీకరించారు. వీరు సంబంధంలేని డిగ్రీ కోర్సు సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసి పరీక్ష రాశారు. వాస్తవానికి ఈ పోస్టులకు బీఏ ఆర్ట్స్, హ్యుమనిటీస్ ఆపైన చదివిన వారు అర్హులుగా నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. బీకాం కూడా అర్ట్స్ గ్రూపే కదా అని కొందరు, ఏదైనా డిగ్రీ సరిపోతుందని మరికొందరు భావించి దరఖాస్తు చేశారు. బీఎస్సీ, బీకామ్, ఎల్ఎల్బీ, బీటెక్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. ఫలితాల్లో మంచి మార్కులు సంపాదించడంతో నగరపాలక అధికారులు వీరిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేశారు. అనంతపురం జిల్లాలో సంబంధం లేని డిగ్రీలు చేసిన వారు అర్హత పొందారని కొందరు అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మన జిల్లాలో కూడా ఇలాంటి అనర్హులున్నారని తేలింది. ఫలితంగా 51 మంది నియామకాలను అధికారులు రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. జరిగిన తప్పును సరిదిద్దేందుకు అ«ధికారులు నియామకపత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు. -
అనర్హులకు పింఛన్లు
విచారణ చేపట్టాలంటూ కలెక్టర్ ఆదేశం జోగిపేట: నగర పంచాయతీ, మున్సిపాల్టీల్లో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో ముందుగా జోగిపేట నగర పంచాయతీ పరిధిలో విచారణ చేపట్టాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. పింఛన్ల విషయమై గత రెండు రోజులుగా 10 మంది డీఆర్డీఏ సిబ్బంది వార్డులవారీగా ఇంటింటికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. శనివారం జోగిపేటలోని 19వ వార్డులో విచారణకు వెళ్లిన సిబ్బందిపై ఆ ప్రాంతానికి చెందిన వారు కొందరు దాడి చేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ విషయాన్ని డీఆర్డీఏ ఏపీఓ విజయలక్ష్మి ధ్రువీకరించారు. విచారణను పట్టణంలో పెన్షన్ పొందుతున్న కొందరు వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది విచారణకు ముందుకురాకుండా తప్పించుకుంటున్నారు. వితంతు పెన్షన్లు పొందుతున్న వారి వద్దకు వెళ్లి భర్త చనిపోయినట్లు సర్టిఫికెట్లు తేవాలని , వికలాంగులకు సదరెం క్యాంపు సర్టిఫికెట్లు చూపాలని కోరినా చాలా మంది చూపించడంలేదని తెలిసింది. దీనిని బట్టి జోగిపేటలో పెద్ద సంఖ్యలో పెన్షన్లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సిబ్బందిపై దాడి చేశారు : ఏపీఓ విజయలక్ష్మి కలెక్టర్ ఆదేశానుసారం జోగిపేటలో రెండు రోజులుగా డీఆర్డీఏ సిబ్బంది పెన్షన్లపై విచారణ జరుపుతున్నారని, పట్టణంలోని 19వ వార్డులో సిబ్బందిపై దాడి చేసినట్లు వారు తమకు సమాచారం ఇచ్చారన్నారు. పట్టణంలో బోగస్ పెన్షన్లు ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో జోగిపేట నుంచే విచారణ మొదలైందన్నారు. వారం రోజుల్లో విచారణ పూర్తి కాగానే కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు. దీని తర్వాత సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా పెన్షన్లపై విచారణ జరుపుతామని తెలిపారు. స్థానికంగా 1వ వార్డులో భర్త చనిపోయినట్లు మహిళ పెన్షన్ పొందుతుండగా భర్త 9వ వార్డులో వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు వచ్చిందన్నారు. నగర పంచాయతీలో 2842 పెన్షన్లు ఉన్నాయని, ఇందులో వృద్యాప్య పెన్షన్లు 1260, చేనేత కార్మికులు 113, వితంతు 1193, వికలాంగులు 225, కల్లుగీత కార్మికులు 51 మంది పెన్షన్లు పొందుతున్నారన్నారు.