breaking news
Uma MLA Bonde
-
సీట్ ఫైట్
టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన కీచులాటలు త్వరలో భేటీకి నిర్ణయం డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్ల పదవుల కోసం పోటీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన ప్రతిపాదనకు డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు కౌన్సిల్ సాక్షిగా గండికొట్టారు. ఈ వివాదం సద్దుమణగకముందే మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఫిర్యాదు అస్త్రాన్ని సంధించారు. నగరపాలక సంస్థలో టీడీపీ పాలి‘ట్రిక్స్’ పార్టీ అధిష్టానానికి దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. కార్పొరేషన్లో ప్రజాప్రతినిధుల చిల్లర వ్యవహారాలతో టీడీపీ అల్లరవుతోంది. డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్ పదవుల కోసం ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పాలన గాలికి వదిలేసిన పాలకులు ఆధిపత్యం కోసం గోల చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ :నగరపాలక సంస్థలో టీడీపీ రాజకీయాలు ఆ పార్టీ అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తున్నాయి. మేయర్ కోనేరు శ్రీధర్ వర్సెస్ స్టాండింగ్ కమిటీ సభ్యుల మధ్య వార్ పరాకాష్టకు చేరింది. కౌన్సిల్లో డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు వ్యవహార శైలి పార్టీలోని మధ్య విభేదాలను బహిర్గతం చేసింది. గత నెల 29వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో 53వ డివిజన్లో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాలుకు గొట్టుముక్కల వెంకట రామరాజు పేరు పెట్టాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రతిపాదించారు. డిప్యూటీ మేయర్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మేయర్, ఫ్లోర్‌లీడర్ సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ససేమిరా అన్నారు. పార్టీలో ఈ వివాదం నడుస్తుండగానే మ్యూటేషన్‌లో కాసుల వేట తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దెరామ్మోహన్, పార్టీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని నాని త్వరలో భేటీ అయి పరిస్థితిని చక్కదిద్దాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్‌లు, మామూళ్ల పంపకాల్లో తేడాలు రావడంతో కొందరు టీడీపీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. ఒక వర్గం పెత్తనమే చెల్లుబాటు అవుతోందన్నది వారి వాదన. ఎన్నికల్లో గెలవడం కోసం తాము లక్షలు ఖర్చు చేశామని, ఇప్పుడు మొత్తం వాళ్లే తింటే ఎలా? అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీకనకదుర్గ లేఅవుట్ వ్యవహారంతో టీడీపీలో రగిలిన మామూళ్ల మంటలు రావణకాష్ఠంలా రగులుతున్నాయి. షాపుల మ్యూటేషన్ (పేరుమార్పిడి) ఫీజు వసూళ్లలో కూడా మామూళ్లే చిచ్చురేపాయి. పోటాపోటీ.. డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లను మార్చిలో మార్పు చేయాలన్న నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశావహులు నేతల చుట్టూ క్యూ కడుతున్నారు. తూర్పు నియోజకవర్గానికి మేయర్, సెంట్రల్‌కు డిప్యూటీ మేయర్, పశ్చిమ నియోజకవర్గానికి ఫ్లోర్‌లీడర్ పదవుల్ని గతంలో కేటాయించారు. ఈసారి కూడా అదే ప్రాతిపదికన పదవుల కేటాయింపు ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. మేయర్ పదవిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని, కోనేరు శ్రీధర్ పనితీరుపై సీఎం సంతృప్తితో ఉన్నారు కాబట్టి మార్పు ఉండదన్నది ఆయన వర్గీయుల వాదన. డిప్యూటీ మేయర్ పదవి కోసం సెంట్రల్ నియోజక వర్గం నుంచి 21,44,45 డివిజన్ల కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి, కాకు మల్లికార్జున యాదవ్, ఆతుకూరి రవికుమార్ పోటీపడుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తనకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలంటూ బాలస్వామి ఇటీవలే ఎమ్మెల్యే బొండా ఉమాను కోరినట్లు తెలుస్తోంది. బీసీ వర్గాలకు చెందిన కాకు మల్లికార్జున యాదవ్, రవికుమార్‌లు ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులుగా పార్టీలో చెలామణి అవుతున్నారు. ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన గోగుల రమణారావు డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు. ఆయన్ను మార్చాల్సి వస్తే బీసీ వర్గానికి చెందిన వారికే పదవి కేటాయించాలనే డిమాండ్‌ను బీసీలు తెరపైకి తెచ్చారు. ఏటా పదవులు మార్చాలి ఫ్లోర్ లీడర్ పదవి కోసం పశ్చిమ నియోజకవర్గం నుంచి 25,28 డివిజన్ల కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), ఎదుపాటి రామయ్య పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కేశినేని నాని ద్వారా వీరు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రామయ్య మేయర్ సామాజికవర్గానికి చెందినవారే కావడంతో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఫ్లోర్‌లీడర్ పదవి ఇస్తానని చంటికి ఎమ్మెల్సీ అభయం ఇచ్చారని సమాచారం. నేతల భేటీ అనంతరం పదవుల పందేరంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇకపై ప్రతి ఏడాది డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్ పదవుల్ని మార్చాలన్నది అధికార పార్టీ కార్పొరేటర్ల అభిప్రాయంగా ఉంది. -
కల్యాణమండపంపై కన్ను
సత్యనారాయణపురంలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయానికి పక్కనే ఉన్న సీతారామ కల్యాణ మండపాన్ని శుక్రవారం దేవాదాయ శాఖాధికారులు స్వాధీనం చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి పత్రాలు చూపకుండా మండపాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారంటూ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డగించి పక్కకు లాగేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు దేవాదాయ అధికారులు మండపాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెరవెనుక ఉండి ఈ తతంగమంతా నడిపారంటూ బ్రాహ్మణ సంఘాలు ఆరోపించాయి. ఇది రాజకీయ నాటకం సత్యనారాయణపురం : స్థానిక సీతారామ కల్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధికారులపై ఒత్తిడి తెచ్చారని బ్రాహ్మణ సంఘాల నేతలు ఆరోపించారు. మండపాన్ని శుక్రవారం దేవాదాయ శాఖా ధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తంతును అడ్డుకున్న బ్రాహ్మణసంఘాలు విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గానికి నడిబొడ్డులో ఉన్న ఈ మండపం కార్యాలయాన్ని దేవాదాయ శాఖ వద్ద లీజుకు తీసుకుని తన కార్యాలయంగా ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణమండపాన్ని తన అనుచరులకు 30ఏళ్లకు లీజుకు ఇప్పించేందుకు బొండా ఉమా ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇది అన్యాయం : గౌతంరెడ్డి 50ఏళ్లుగా బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి అన్నారు. బొండా ఉమా ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇది జరిగిందని, ఎటువంటి పత్రాలు చూపించకుండా పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. ఖండిస్తున్నాం.. : మల్లాది విష్ణు పేద, మధ్యతరగతికి చెందిన బ్రాహ్మణుల కుటుంబాలు ఈ కల్యాణ మండపంలో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక పోలీసుల సహకారంతో కోర్టులో ఉన్న ఈ స్థలాన్ని ఎండోమెంట్, రెవెన్యూ సిబ్బంది దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. దీనిని ఖండిస్తున్నామన్నారు. బలవంతపు స్వాధీనం దేవాదాయశాఖ స్వాధీనానికి సంబంధించిన ఎటువంటి పత్రాలను చూపలేదని భువనేశ్వరిపీఠ ధర్మాధికారి చంద్రశేఖర్ అన్నారు. ఎప్పుడో 2010 హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారని, మేము పైకి అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం ఉందని ఆయన పేర్కొన్నారు. స్థలం దేవస్థానానిదే.. ఎమ్మార్వో శివరావు, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 583 గజాలు దేవస్థానం కోసం వినియోగించాలని దాతలు ఈ స్థలాన్ని కొన్నారని, ఉత్సవాలు, ఇతర సమయాల్లో భోజనాల కోసం కేటాయించారని చెప్పారు. కాలక్రమేణ అక్కడ ప్రయివేటు వ్యక్తులు కల్యాణ మండపాన్ని నిర్మించారని, దీనిపైన ఆరోపణలు రావడంతో కోర్టును ఆశ్రయించామని, 40 ఏళ్లకు పైగా కోర్టులో దీనిపైనే వాదనలు జరిగాయని చెప్పారు. ఇటీవల స్థలం దేవ స్థానానికే చెందుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనిపైన వారు కోర్టుకు వెళ్లినా డిస్మిస్ చేశారని, అందుకే స్థలాన్ని స్వాధీనం చేసుకుని దేవస్థానానికి అప్పగిస్తున్నామని చెప్పారు.