breaking news
Tussauds Museum
-
ఆరని అగ్నికీలలు
లాస్ ఏంజెలెస్: ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మలైన లాస్ ఏంజెలెస్ అటవీప్రాంతాలు ఇప్పుడు అగ్నికీలల్లో మాడి మసైపోతున్నాయి. వర్షాలు పడక ఎండిపోయిన అటవీప్రాంతంలో అంటుకున్న అగ్గిరవ్వ దావానంలా వ్యాపించి ఇప్పుడు వేల ఎకరాల్లో అడవిని కాల్చిబూడిద చేస్తోంది. పసిఫిక్ తీరప్రాంతం మొదలు పాసడేనా వరకు మొత్తం ఐదు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని రాజుకుని వేల ఎకరాలకు వేగంగా వ్యాపించి వందల ఇళ్లు, ఆఫీస్ కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలను భస్మీపటం చేసింది. ఈ ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పసిఫిక్ పాలిసాడ్స్, అల్టాడేనా ప్రాంతాల్లో దావాగ్ని భీకరంగా ఎగసిపడుతూ 17,234 ఎకరాల అటవీప్రాంతాన్ని ఇప్పటికే కాల్చేసింది. ఈటన్ ప్రాంతంలో 10,600 ఎకరాలకుపైగా అటవీభూములు దగ్ధమయ్యాయి. హర్స్ట్ ప్రాంతంలో 855 ఎకరాలు, లిడియా ప్రాంతంలో 348 ఎకరాల మేర అడవి ఇప్పటికే అగ్నికి ఆహుతైంది. పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలోని మలీబూ తీరం వెంటే హాలీవుడ్ సినీ దిగ్గజాల విలాసవంత నివాసాలున్నాయి. ఇందులో ఇప్పటికే చాలామటుకు కాలిబూడిదయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్‌కు చెందిన ఇంటినీ కార్చిచ్చు దహించివేసింది. దావాగ్నిలో దహనమైన నివాసాల్లో చాలా మంది హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు ఉన్నాయి. లాస్ ఏంజెలెస్ చరిత్రలో ఎన్నడూలేనంతటి భీకర అగ్నిజ్వాలల ధాటికి 1,79,700 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికార యంత్రాంగం సూచించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాత్రిళ్లు లక్షలాది కుటుంబాలు అంధకారంలో గడిపాయి. దాదాపు 3,10,000 మంది కరెంట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. పెనుగాలులతో వినాశకర స్థాయిలో విజృంభిస్తున్న మంటలను అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. మంటలను అదుపుచేయడం మా వల్ల కాదని కొందరు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే చేతులెత్తేశారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఉన్న మంటలకు తోడు కొత్తగా బుధవారం సాయంత్రం హాలీవుడ్ హిల్స్‌లో కొత్తగా అగ్గిరాజుకుని స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సన్‌సెట్ ఫైర్‌గా పిలుస్తున్న ఈ దావాగ్ని మాత్రమే అత్యల్పంగా 43 ఎకరాలను దహించింది. టీసీఎల్ చైనీస్ థియేటర్ మొదలు ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఉన్న వీధులనూ అగ్నికీలలు ఆక్రమించాయి. ఎన్నో సినిమాల్లో కనిపించిన ఫేమస్ పాలిసాడ్స్ చార్టర్ హైస్కూల్ భవనం కాలిపోయింది. సన్‌సెట్ బోల్వార్డ్సహా ఎన్నో కొండ అంచు కాలనీల్లో ఖరీదైన ఇళ్లను మంటలు నేలమట్టంచేశాయి. ప్రముఖుల ఇళ్లు నేలమట్టం హాలీవుడ్ సినీరంగ ప్రముఖుల ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. మ్యాండీ మూర్, క్యారీ ఎల్విస్, ప్యారిస్ హిల్టన్, స్టీవెన్ స్పీల్బర్గ్, టామ్ హ్యాంక్స్, బెన్ ఎఫ్లేక్, ఆడమ్ శాండ్లర్, యూజిన్ లేవీ, బిల్లి క్రిస్టల్, జాన్ గుడ్మాన్, విల్ రోజరెస్, జేమ్స్ లీ కర్టిస్, జేమ్స్ ఉడ్స్ సహా చాలా మంది ప్రముఖుల ఇళ్లు తగలబడ్డాయి. ‘‘వీధుల్లో ఎక్కడ చూసినా కాలిన చెక్క ఇళ్ల చెత్తతో నిండిన స్విమ్మింగ్ ఫూల్స్ కనిపిస్తున్నాయి. యుద్ధంలో బాంబు దాడుల్లో దగ్దమైన జనావాసాల్లా ఉన్నాయి’’అని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశాయి. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో మే నెల నుంచి చూస్తే కేవలం 0.1 అంగుళాల వర్షపాతమే నమోదైంది. ఎండిపోయిన పర్వత సానువుల అడవీ ప్రాంతం గుండా గంటకు 80 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు ఈ మంటలను మరింత ఎగదోస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు పడకపోతే శీతాకాలమంతా దావానలం దారుణ పరిస్థితులను ఎదుర్కోక తప్పదని వెస్టర్న్ ఫైర్ చీఫ్ అసోసియేషన్ హెచ్చరించింది. పాసడీనా, పసిఫిక్ పాలిసాడ్స్‌లో భీకర మంటల భయంతో పలు హాలీవుడ్ స్టూడియోలు మూతపడ్డాయి. యూనివర్సల్ స్టూడియోస్ తమ థీమ్ పార్క్‌ను మూసేసింది. ‘‘ వింతవింత కుందేలు బొమ్మలతో బన్నీ హౌజ్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న మా మ్యూజియం బుగ్గిపాలైంది. గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద బన్నీ భవనం నెలకొల్పడానికి మాకు 40 ఏళ్లు పట్టింది. అది ఇప్పుడు నిమిషాల్లో కాలిపోయింది’’ అని ఆల్టాడేనాలోని సీŠట్వ్ లుబాన్‌స్కీ, కాండేస్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కార్లు, వస్తువులకు ఏమాత్రం ఇన్సూరెన్స్ వస్తుందోనని చాలా మంది దిగాలుగా కనిపించారు.ఆస్కార్‌కూ సెగ కార్చిచ్చు సెగ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులనూ తాకింది. దీంతో అకాడమీలో నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. వాస్తవానికి బుధవారం నుంచి 14వ తేదీదాకా నామినేషన్ ప్రక్రియ కొనసాగాలి. అగ్నికీలలు వ్యాపించడంతో ఓటింగ్ ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 17వ తేదీన ప్రకటించాల్సిన ఆస్కార్ నామినేషన్లను జనవరి 19కు వాయిదా వేశారు.చేతివాటం చూపిన దొంగలు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఇళ్లు వదిలిపోతుండటంతో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దగ్ధ్దమవుతున్న ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. ఇలా లూటీ చేస్తున్న 20 మందిని అరెస్ట్‌చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్చిచ్చు ఘటనల్లో ఇప్పటిదాకా 4 లక్షల కోట్ల రూపాయల సంపద అగ్నికి ఆహుతైందని బైడెన్ సర్కార్ ప్రాథమిక అంచనావేసింది. తన చిట్టచివరి అధికారిక పర్యటనలో భాగంగా ఇటలీకి వెళ్దామనుకున్న బైడెన్ ఈ అనూహ్య ఘటనతో పర్యటనను అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. మరోవైపు కార్చిచ్చు ఉదంతంలో సరిగా స్పందించని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తున్న అగ్నికీలలు ప్రైవేట్ శాటిలైట్ ఛాయాచిత్రాల సేవలందించే మ్యాక్సర్ టెక్నాలజీస్ తదితర ఉపగ్రహ సేవా సంస్థలు తీసిన ఫొటోలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఫొటోల్లో.. కాలిఫోర్నియాలోని మాలిబు తీరపట్టణ ప్రాంత శాటిలైట్ ఫొటోల్లో ఇప్పుడంతా కాలిబూడిదైన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఆకాశమంతా దట్టంగా కమ్ముకున్న పొగలతో నిండిపోయింది. ఈస్ట్ ఆల్టాడీనా డ్రైవ్ ప్రాంతమంతా బూడిదతో నిండిపోయింది. శక్తివంతమైన శాంటా ఆనా వేడి పవనాలు తూర్పులోని ఎడారి గాలిని తీరప్రాంత పర్వతాలపైకి ఎగదోస్తూ మంటలను మరింత ప్రజ్వరిల్లేలా చేస్తున్నాయి. ఉచితాలు.. సాయాలు సర్వం కోల్పోయిన స్థానికులను ఆదుకునేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్కువ ధరకే వాహనాల్లో రైడ్ అందిస్తామని ఉబర్, లిఫ్ట్ సంస్థలు తెలిపాయి. ఉచితంగా స్నానాల గదులు, లాకర్ రూమ్, వై–ఫై సౌకర్యాలు అందిస్తామని ప్లానెట్ ఫిట్నెస్ తెలిపింది. తమ గదుల్లో ఉచితంగా ఉండొచ్చని ఎయిర్‌బీఎన్‌బీ పేర్కొంది. హోటళ్లలో డిస్కౌంట్‌కే గదులిస్తామని విసిట్ అనహీమ్ వెల్లడించింది. అపరిమిత డేటా, కాల్, టెక్సŠస్ట్ ఆఫర్ ఉచితంగా ఇస్తామని ఏటీ అండ్ టీ, వెరిజాన్ సంస్థలు ప్రకటించాయి. -
కుందనపు బొమ్మ... మైనపు బొమ్మ
కళ్లు తిప్పుకోలేని అందం దీపికా పదుకోన్‌ది. ఇక నుంచి ఈ అందాల ముద్దు గుమ్మ లండన్‌లో మైనపు బొమ్మలా కనిపించనున్నారు. ఎందుకంటే.. లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో దీపికా పదుకోన్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట. సోమవారం ఈ మైనపు విగ్రహానికి కావాల్సిన నమూనాలను తుస్సాడ్స్ టీమ్‌కు ఇచ్చారు దీపికా పదుకోన్. ఈ ఏడాది దీపికా పదుకోన్‌కు బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ‘పద్మావత్’ సినిమా బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్’ లిస్ట్‌లో ఆమె చోటు దక్కించునున్నారు. అలాగే ఈ ఏడాది చివర్లో ప్రియుడు రణ్వీర్ సింగ్‌తో వివాహం కూడా ఖరారు అయింది. ఇన్ని గుడ్ న్యూస్‌లన్నింటికీ తోడు ప్రతిష్టాత్మక మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహానికి చోటు దక్కడం మరో గుడ్ న్యూస్. ఈ విషయాన్ని దీపికా ట్వీటర్లో ‘ఇట్స్ ఆల్ ఎబౌట్ ది డీటైల్స్’ అంటూ తుస్సాడ్స్ మ్యూజియంకి కావాల్సిన కొలతలను ఇస్తున్న ఫొటోను పోస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. విశేషం ఏంటంటే.. ఈ కుందనపు బొమ్మ మైనపు విగ్రహాన్ని బాలీవుడ్ సెలబ్రిటీస్ విగ్రహాలతో పాటుగా కాకుండా ఎ– లిస్ట్ సెక్షన్ పర్సనాలటీలు హాలీవుడ్ తారలు హెలెన్ మిర్రెన్, ఏంజెలీనా జోలీ మధ్య ఏర్పాటు చేయనున్నారు. హాలీవుడ్ స్టార్స్‌ని ‘ఎ’ లిస్ట్ సెక్షన్ అని తుస్సాడ్స్ వారు అంటారు. ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ సంవత్సరం దీపిక కెరీర్లో బెస్ట్ ఇయర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. -
కరణ్‌కి కుచ్ కుచ్ హోతా హై
‘కుచ్ కుచ్ హోతా హై’.. ఇది కరణ్ జోహార్ డైరెక్టర్ చేసిన తొలి మూవీ. ఆ సినిమా చాలామంది మనసుల్లో ఏదో ఏదో జరిగేలా చేసింది. తీయని అనుభూతిని మిగిల్చింది. ఇప్పుడు కరణ్ జోహర్ మనసులో కూడా కుచ్ కుచ్ హోతా హై. ఎందుకంటే.. డైరెక్టర్ కమ్ రైటర్‌గా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన కరణ్ తర్వాత డైరెక్టర్‌గా బీటౌన్‌లో సక్సెస్ అయ్యారు. ధర్మ ప్రొడక్షన్స్‌పై ఎన్నో బిగ్గెస్ట్ మూవీస్‌ను నిర్మించడమే కాదు సూపర్‌హిట్స్ అందుకున్నారు. దర్శక–నిర్మాతగా కరణ్ జోహార్‌కి ఉన్న సక్సెస్ఫుల్ ట్రాక్ ఆయన్ను మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్ వరకూ తీసుకెళ్లింది. లండన్ మేడమ్ తుస్సాడ్స్‌లో కొన్ని రోజుల్లో ఆయన మైనపు బొమ్మ దర్శనమివ్వనుంది. ఈ విషయాన్ని కరణ్ సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశారు ‘‘మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్‌లో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయ ఫిల్మ్ మేకర్ని నేనే కావడం ఆనందంగా ఉంది. నా బొమ్మ తయారీ కోసం కొలతలు తీసుకున్నారు. నా విగ్రహం కోసం వర్క్ చేస్తున్న లండన్ టీమ్‌కి థ్యాంక్స్’’ అన్నారు కరణ్ జోహార్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి’ రెండు భాగాలను హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
టుస్సాడ్స్‌లో కోహ్లి...
న్యూఢిల్లీ: తన ఆటతో దేశ విదేశాల్లో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. దేశ రాజధానిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు బొమ్మ ప్రతిష్టించనున్నట్లు మ్యూజియం నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ విగ్రహాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో విరాట్ దిగ్గజాల సరసన నిలవనున్నాడు. దీనిపై విరాట్ స్పందిస్తూ... ‘ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మేడమ్ టుస్సాడ్స్ బృందానికి కృతజ్ఞతలు. ఇది నాకు జీవితాంతం మరువలేని జ్ఞాపకం’ అని అన్నాడు. విరాట్ కోహ్లి ఇప్పటికే ఐసీసీ నుంచి ‘వరల్డ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, బీసీసీఐ నుంచి ‘ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు సొంతం చేసుకున్నాడు. -
టుస్సాడ్స్‌లో కపిల్ దేవ్ ప్రతిమ
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఈమేరకు విగ్రహం తయారీ కోసం టుస్సాడ్స్ ప్రతినిధులు కపిల్‌దేవ్‌ను కలిశారు.