breaking news
traffic stop
-
భగ్గుమన్న ఫ్రాన్సు
పారిస్: పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి ఘటనతో ఫ్రాన్సు భగ్గుమంది. పారిస్ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద మంగళవారం నహెల్ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ముఖ్యంగా పారిస్ నగరంలోని స్కూళ్లు, టౌన్హాళ్లు, పోలీస్ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు నిప్పంటించారు. రాళ్లు రువ్వారు. వీటిని నిలువరించేందుకు పోలీసులు పలుమార్లు బాష్పగోళాలు ప్రయోగించారు. దాడుల్లో 100కు పైగా ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నట్లు అంచనా వేసింది. ఆందోళనకారుల దాడుల్లో 170 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఫ్రాన్సు ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బంది, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సు, రైలు సర్వీసులను నిలిపివేసింది. దీని ఫలితంగా రాజధాని, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాడులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ప్రస్తుతమున్న పోలీసుల సంఖ్యను 9 వేల నుంచి 40 వేలకు పెంచింది. నిరసనకారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. యువకుడిపై కాల్పుల ఘటనకు కారకులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
కారును ఆపమన్నందుకు పోలీసుపై కాల్పులు
వాషింగ్టన్: కారును ఆపమ్మన్నందుకు ఓ పోలీసు అధికారిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అమెరికాలోని అట్లాంటాలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ పోలీసు అధికారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాలు ఇవి. అట్లాంటా సిటీ దక్షిణ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు అధికారి అటుగా వస్తున్న కారును ఆపమని కోరాడు. ఈ క్రమంలో కారు దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్న అతడిపై కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో పోలీసు అధికారి ఎడమ కంటి పై భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మిగతా పోలీసులు తేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు పోలీసు అధికారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులకు పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని విచారణ అధికారి మైక్ జోల్లీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పోలీసు అధికారి డ్యాష్ కెమేరాలో రికార్డయ్యాయి.