breaking news
Toothace
-
పంటి నొప్పితో బాధపడుతున్నారా... ఇలా చేశారంటే!
అకస్మాత్తుగా వచ్చే పంటి నొప్పితో ఎంతటి వారైనా విలవిల్లాడిపోతారు. ఎక్కువగా రాత్రుళ్లు మొదలయ్యే పంటినొప్పి కొన్ని గంటల పాటు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ సమయంలో తక్షణం నొప్పి నుంచి ఉపశమనం అందించే మందు కోసం చూస్తాం. ఆ తర్వాత వైద్యుడి వద్దకు వెళతాం. తక్షణ ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు... పంటినొప్పి బాధిస్తున్నప్పుడు తక్షణం నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ రిలీఫ్ జెల్స్ ఉపయోగపడతాయి. ఇందులో ఇజినాల్, కర్పూరం, పుదీనా ఉంటాయి. ఈ జెల్‌ను పన్ను నొప్పి ఉన్న చోట ఒక చుక్క వేసి కాసేపు మర్ధన చేసినట్లయితే మూడు నిమిషాల్లోనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇజినాల్ అనస్థెటిక్గా, యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. అయితే తక్షణ ఉపశమనం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. చికిత్స కాదు. చికిత్స కోసం దంతవైద్యుని సంప్రదించి కారణం తెలుసుకుని చికిత్స తీసుకోవాలి. ►పంటినొప్పి ఉన్నవారు ఒక గ్లాసు వేడినీటిలో చెంచా ఉప్పును కలిపి, ఆ నీటితో నోటిని బాగా పుక్కిలిస్తే పంటి నొప్పి, చిగుళ్ల వాపు తగ్గుతాయి. ఉప్పునీరు ఒక సహజమైన మౌత్ వాష్‌లా బ్యాక్టీరియాపై దాడిచేసి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. ►కొన్ని మిరియాలను లేదా లవంగాలను మెత్తగా నూరి దానికి కొన్ని నీళ్ళు చేర్చి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టుని కొద్దిగా తీసుకొని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే నొప్పిని తగ్గిస్తుంది. ►లవంగాల్ని మెత్తగా నూరి దానిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే నొప్పి తగ్గిపోతుంది. లవంగాల బదులుగా లవంగ నూనె తీసుకొని దానిని దూదికి అడ్డుకొని ఆ దూదిని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది. ►క్లోవ్ ఆయిల్ పేరుతో లవంగనూనె చిన్న చిన్న సీసాలలో మెడికల్ షాపుల్లోనూ, సూపర్ బజార్లలోనూ కూడా దొరుకుతుంది. ►కొంచెం దూదిని తీసుకొని దానిని నీటిలో తడిపి తరువాత బేకింగ్ సోడాలో ముంచి నొప్పి ఉన్న పంటిపైన ఉంచితే నొప్పి తగ్గిపోతుంది. పంటి నొప్పి బాధించకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా డెంటిస్ట్ చెకప్ చేసుకోవాలి. సంవత్సరానికి ఒకటి రెండుసార్లు దంతాలను క్లీన్ చేయించుకోవాలి. రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలను తిన్న తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించి ఉమ్మేయడం వల్ల దంతసమస్యలు రాకుండా చూసుకోవచ్చు. -
పంటి నొప్పితో అంత ప్రమాదమా?
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని పెద్దలు ఎందుకనేవారో తెలియదు కానీ... నోరు శుభ్రంగా ఉంచుకోపోతే అనారోగ్యాలు మాత్రం తప్పవని ఓ పళ్ళ డాక్టర్ చెప్పిన విషయం ఇప్పుడు 26 ఏళ్ళ మాలా విషయంలో నిజమైంది. పంటినొప్పే కదాని నొప్పి మాత్రలతో సొంతవైద్యం చేసుకొని ప్రాణాలమీదకి తెచ్చుకున్న మాలా... ఆహారం, నీరు సైతం తీసుకోలేని స్థితిలో చివరికి ఐసీయూ లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రిమియర్ బి స్కూల్ ఉద్యోగిగా, జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్న మాలా... ఓ సాధారణ పంటినొప్పి అన్ని అవయవాలకు ప్రమాదం తెస్తుందని (మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్) ఎప్పుడూ ఊహించలేదు. మూడుసార్లు తేలికపాటి కార్డియాక్ అటాక్ లను ఎదుర్కొని, రెండునెల్లపాటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఆమె... ఎట్టకేలకు చివరికి ప్రాణాలతో బయటపడింది. చిన్నపాటి పంటినొప్పితోపాటు కుడి దవడ వాపుతో ప్రారంభమైన మాలా అనారోగ్యం అశ్రద్ధ కారణంగా ప్రాణాలమీదికి వచ్చింది. నొప్పిమాత్రలతో సమస్య తగ్గకపోగా దవడ వాపు చివరికి గొంతు పూడుకుపోయే పరిస్థితికి చేరింది. రోజురోజుకూ నీరసపడిపోయి, నొప్పిని కూడా తట్టుకోలేని స్థాయికి చేరడంతో ఆమె తల్లి మాలాను ఆస్పత్రిలో చేర్పించింది. పంటితో మొదలైన ఇన్ఫెక్షన్ అన్ని అవయవాలకు పాకిపోయిందని, చివరికి మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్ సిండ్రోమ్ తో ఆమె బాధపడుతున్నట్లు డాక్టర్లు వైద్య పరీక్షలద్వారా తేల్చారు. సిండ్రోమ్ కారణంగా మాలా తీవ్రమైన జ్వరం, లో బీపీ తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిందని ఆమెకు వ్యైద్యం నిర్వహించిన ఆస్పత్రి కంన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, ఫోర్టిస్ డాక్టర్ సుధా మెనన్ తెలిపారు. మొదట్లో మాలా డెంగ్యూతో బాధపడుతోందనుకున్నామని, న్యుమోనియాకు గురవ్వడం వల్ల వెంటిలేటర్ పై ఉంచాల్సి వచ్చిందని, ఐసీయు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమై చికిత్స నిర్వహించడంతో మాలా చివరికి కోలుకోగలిగినట్లు మెనన్ తెలిపారు. ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా చేరి... గుండె, తల, మెడ భాగాల్లో వ్యాప్తి చెందడంతో మాలా తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు సంక్రమించిన సిండ్రోమ్ వల్ల కనీసం గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఎదురైందని, శస్త్ర చికిత్సతో ట్రాకోస్టమీ ట్యూబ్ ద్వారా ఇన్ఫెక్షన్ ను బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. బ్యాక్టీరియావల్ల ఇతర నాళాలు కూడ బ్లాక్ అవ్వడం, ఇన్ఫెక్షన్ బ్లాక్స్ చిన్న చిన్న ముక్కలై ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించే పల్మనరీ ఆర్టరీ నాళాలు మూసుకుపోవడంతో మాలా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఊపిరి తీసుకోలేకపోవడం, గుండెనొప్పి, తీవ్ర నిమోనియా సంక్రమించి ఇతర భాగాలకు వ్యాపించడంతో మాలా ఉన్నట్లుండి 20 కేజీల బరువుకూడా తగ్గిపోయింది. వైద్యుల అప్రమత్తతో ఎట్టకేలకు ప్రాణాపాయం నుంచీ బయటపడిన మాలా... చిన్న చిన్న నొప్పులు, కావిటీలేకదాని అశ్రద్ధ చేయొద్దని, నోటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, అప్రమత్తంగా ఉండటం కూడ ఎంతో అవసరం అని చెప్తోంది. పంటినొప్పి ప్రమాదాలకు దారితీస్తుందనడానికి తానే పెద్ద ఉదాహరణ అని, గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకోవద్దని సూచిస్తోంది.