కుండ్ మేళా.. థీమ్ స్టేట్‌గా తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సాగే సూరజ్‌కుండ్ మేళాలో థీమ్స్టేట్గా తెలంగాణ ఉంటుందని, ఈ మేళాలో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటుతామని తెలంగాణ టూరిజం విభాగం ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. బుధవారం మేళా ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫిబ్రవరి 4, 9, 13 తేదీల్లో తెలంగాణ దినోత్సవం నిర్వహించనున్నట్టు వివరించారు. మేళా మొత్తం తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుందని వివరించారు. చార్మినార్, కాకతీయ తోరణం, గోల్కొండ కోట, బోనాలు, బతుకమ్మ, నిర్మల్ బొమ్మలు, చౌమహల్లా ప్యాలెస్ వంటి నిర్మాణాల నమూనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. 13వ తేదీన తెలంగాణ సంస్కృతి, కట్టుబాట్లతో ఫ్యాషన్ షో ఉంటుందని వివరించారు.