breaking news
tgv kalaksetram
-
మనిషి కాటు..ఇక చాలు!
– అలరించిన జాతీయ నాటిక పోటీలు కర్నూలు(హాస్పిటల్): స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో కొనసాగుతున్న జాతీయ నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తిఓబులయ్య అధ్యక్షతన రెండోరోజైన సోమవారం నాటికలను ప్రదర్శించారు. గుంటూరు జిల్లా కర్రిపాడుకు చెందిన ఉషోదయ కళానికేతన్ వారు ప్రదర్శించిన ‘గోవు మాలచ్చిమి’, నెల్లూరు జిల్లా చెన్నూరుకు చెందిన శ్రీ శాలివాహన కళామందిర్ వారి ‘మనిషికాటు’, పి. భవానీప్రసాద్ రచించిన, గోపరాజు విజయ్ దర్శకత్వం వహించిన శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి వారి ‘చాలు ఇక చాలు’ నాటికలు ఆలోచింపజేశాయి. అంతకు ముందు ముఖ్యఅతిథి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ నాటిక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. సామాజిక ఇతివృత్తాలతో నాటికలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. నాటక రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అమ్మతనం గురించి తెలిపే గోవు మాలచ్చిమి గుంటూరు జిల్లా కర్రిపాడుకు చెందిన ఉషోదయ కళానికేతన్ వారు ప్రదర్శించిన ‘గోవు మాలచ్చిమి’ నాటిక ఆకట్టుకుంది. మనిషిని కంప్యూటర్ శాసిస్తున్న కాలంలోనూ మహిళను మగవాడు శాసిస్తూనే ఉన్నాడని ఈ నాటిక చెబుతుంది. మన దేశంలో అమ్మకు, అమ్మతనానికి ఎంతో విలువ ఉందని, దయచేసి దాన్ని చెడగొట్టకండనే సందేశంతో ఈ నాటిక ముగుస్తుంది. రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు వహించగా, చెరుకూరి సాంబశివరావు, జి. లహరి, జానారామయ్య, కె.మస్తాన్రావు నటించారు. అపకారికి ఉపకారం చేయాలనే ‘మనిషి కాటు’ నెల్లూరు జిల్లా చెన్నూరుకు చెందిన శ్రీ శాలివాహన కళామందిర్ వారి ‘మనిషి కాటు’ నాటిక ఆలోచింపజేసింది. ఈ ప్రపంచం మొత్తం అవినీతితో కప్పివేయబడ్డా ఎక్కడో సమాజానికి దూరంగా ఉన్నా స్వచ్ఛమైన మనుషుల్లో దాగి ఉన్న మానవత్వపు విలువలు–నీతి నిజాయతీల ఉనికి ఇంకా మిగిలే ఉందని ఈ నాటిక చెబుతుంది. అపకారం చేసిన మనిషికి సైతం ఉపకారం చేసి పంపాలనే మనుషుల మానవత్వపు విలువలతో సాగే నాటిక మనిషి కాటు. దీనికి రచన వలమేటి, దర్శకత్వం కెకె.రావు. వి. కృష్ణమూర్తి, పి. రామమనోహర్, ఎస్. జగన్మోహన్రావు, ఎం. ప్రసాద్, ఎ. రవి, ఎస్ఏ షరీఫ్, సుజాత నటించారు. -
నేటి నుంచి జాతీయ స్థాయి నాటిక పోటీలు
–మూడురోజుల పాటు ప్రదర్శనలు కర్నూలు(హాస్పిటల్): టీజీవీ కళాక్షేత్రం(లలితకళాసమితి) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14, 15, 16వ తేదీల్లో జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ టీజీ భరత్, అధ్యక్షుడు పత్తి ఓబులయ్య చెప్పారు. శనివారం స్థానిక మౌర్య ఇన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహించడం 11వ సారన్నారు. నేటితరం, భావితరాలు మన సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 14న సాయంత్రం 6గంటలకు ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, 16వ తేదీన ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ హాజరవుతారని వెల్లడించారు. నాటక ప్రదర్శనల వివరాలు –14వ తేది రాత్రి 7.30 గంటలకు శ్రీ జయ ఆర్ట్స్, హైదరాబాద్ వారి ‘సందడే సందడి’ –14వ తేది రాత్రి 8.30 గంటలకు శ్రీ అంజన రాథోడ్ థియేటర్స్ వారి ‘సప్తపది’ –15వ తేది సాయంత్రం 6.30 గంటలకు శ్రీ ఉషోదయ కళానికేతన్, కాట్రపాడు వారి ‘గోవు మాలక్ష్మి’ –15 రాత్రి 8 గంటలకు శ్రీ శాలివాహన కళామందిర్, చెన్నూరు, నెల్లూరు వారి ‘మనిషి కాటు’ –15 రాత్రి 9 గంటలకు నెల్లూరు వారి ‘మాతృవందనం’ –16వ తేది ఉదయం 10.30 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరి వారి ‘చాలు ఇక చాలు’ –16వ తేది మధ్యాహ్నం 11.45 గంటలకు శ్రీమూర్తి కల్చలర్ అసోసియేషన్ వారి ‘అంతిమతీర్పు’ –16వ తేది మధ్యాహ్నం 12.45 గంటలకు సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి ‘కల్లం దిబ్బ’