ఏపీఐడీసీఎల్‌కు త్వరలో కొత్త బోర్డు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఐడీసీఎల్)కు త్వరలోనే తెలంగాణ కార్పొరేషన్‌గా పేరుమార్చి కొత్త బోర్డును ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కార్పొరేషన్ బోర్డులో ఇంకా ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారులే చైర్మన్లుగా, సభ్యులుగా కొనసాగుతున్న దృష్ట్యా వారిని తొలగించాలని నిర్ణయించింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఇంజనీర్ ఇన్ చీఫ్ కన్వీనర్‌గా, చిన్న నీటి పారుదల శాఖ, భూగర్భ జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్లు, ట్రాన్స్‌కో ఇంజనీర్ సభ్యులుగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిధ్దమైంది. దీనిపై మూడు నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వె లువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేటీపీఎస్ ఏడో దశకు 0.8టీఎంసీల గోదావరి నీరు: ఖమ్మం జిల్లా పాల్వంచలో 800ల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించనున్న కేటీపీఎస్ ఏడో దశ విద్యుదుత్పత్తి కేంద్రానికి గోదావరి నుంచి ఏడాదికి 0.8టీఎంసీల నీరు వాడుకునేందుకు అనుమతిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.