జానపద కళాకారుడు తండ భిక్షం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, పోలేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళాకారుడు, తెర చీరల పండితుడు తండ భిక్షం (101) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. అలాగే, పలు తాళపత్ర గంథ్రాలు రాశారు. అసాధారణ మౌఖిక శక్తి, కథా, కథన కౌశలం ఆయన ప్రత్యేకత. అత్యంత ప్రాచీన కళారూపమైన తెరచీరల ప్రదర్శనకు భిక్షం పేరు తెచ్చారు.
ఆయన మరణంతో కళారంగం ముద్దుబిడ్డని కోల్పోయిందని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఒక ప్రకటనలో పేర్కొంది. తెరవే రాష్ట్ర అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, హైదరాబాద్ విశ్వవిద్యాయలం ప్రొఫెసర్ ఆర్ఎస్ సర్రాజు సంతాపం తెలిపారు.