breaking news
stones attack police
-
కోల్‌కతాలో యుద్ధ వాతావరణం
కోల్‌కతా/హౌరా: బీజేపీ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం సందర్భంగా గురువారం కోల్‌కతా, హౌరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణలకు దిగారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దాంతో, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. ఘర్షణల్లో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో కోల్‌కతా, హౌరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రోడ్లపై ఎక్కడ చూసినా.. కాల్చిన టైర్లు, రువ్విన రాళ్లు కనిపించాయి. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా, వేలాది కార్యకర్తలు మధ్నాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సచివాలయం వైపునకు వెళ్లడం ప్రారంభించారు. హౌరా మైదాన్ నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ మార్చ్ ప్రారంభించారు. వారిని మాలిక్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కార్యకర్త నుంచి బుల్లెట్లతో ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు తమపై నాటు బాంబులు వేశారని పోలీసులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు నేతృత్వంలో సాగిన మార్చ్‌ను సాంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడా ఘర్షణ జరిగింది. పోలీసులతో ఘర్షణల్లో బీజేపీ నేత రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో గాయపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్ఘీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌ల నేతృత్వంలో సాగిన చలో సెక్రటేరియట్ మార్చ్‌ను కోల్‌కతాలోని హాస్టింగ్స్–ఖిద్దర్‌పోర్ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీఎంసీ గూండాలు తమపై దాడి చేశారని విజయ్‌వర్ఘీయ ఆరోపించారు. దాదాపు వంద మందికి పైగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం తలపెట్టిన మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమత సర్కారును సాగనంపాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. మమత బెనర్జీ అవినీతిమయ, హింసాత్మక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారన్నారు. మమత పాలనకు బీజేపీ అంతం పలకడం ఖాయమన్నారు. ‘మమత తన సచివాలయాన్ని మూసివేసుకునేలా ధీరులైన మా బీజేవైఎం కార్యకర్తలు పోరాడారు. ఆమె ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారనేందుకు ఇదే ఉదాహరణ’ అని నడ్డా ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే విషయంలో మాత్రం గత వామపక్ష ప్రభుత్వం కన్నా మమత సర్కారు మెరుగ్గా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లాఠీచార్జీలో గాయపడి, రోడ్డుపైనే పడిపోయిన ఓ కార్యకర్త -
రాళ్లమూకలపై కాల్పులు.. ముగ్గురి మృతి
శ్రీనగర్: కశ్మీర్లో రాళ్లు రువ్వుతున్న అల్లరి మూకల నుంచి తప్పించుకునే క్రమంలో భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో బాలిక సహా ముగ్గురు మృతి చెందారు. ఉగ్ర నేత బుర్హాన్ వనీ వర్ధంతి సందర్భంగా కశ్మీర్లో చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కుల్గామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా హవూరా మిషిపోరాలో పెట్రోలింగ్ వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వారిని అడ్డగించేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అండ్లీబ్ అనే బాలికతోపాటు, షకీర్ అహ్మద్, ఇర్షాద్ అహ్మద్ చనిపోయారు. అల్లరిమూకలపైకి బాష్పవాయువు ప్రయోగం -
శేషాచలం అడవుల్లో పోలీసులపై రాళ్లదాడి
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో మంగళవారం కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లదాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం వారిమెట్టు సమీపంలోని సచ్చినోడిబండ వద్ద శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో టాస్క్‌ఫోర్స్‌కు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దాంతో ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు ఒక రౌండు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సందర్బంగా ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకోవడంతో పాటు 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు సంఘటన స్థలానికి బయలుదేరారు.