చిల్లర కొట్టులో బీమా చెల్లింపులు!
- కరెంట్, నల్లా, డీటీహెచ్ బిల్లులు కూడా
- స్పాట్ పేమెంట్ సొల్యూషన్ యాప్‌ను ఆవిష్కరించిన పేనియర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కిరాణ దుకాణం.. ఇప్పటి వరకు ఉప్పులు, పప్పుల వంటి వంటింటి నిత్యావసరాలకే పరిమితమైంది. కానీ, ఇప్పుడవి కూడా స్మార్ట్‌గా మారనున్నాయి. ఎంతలా అంటే.. చిల్లర కొట్టులో బీమా పాలసీ చెల్లింపులు, కరెంట్, నల్లా బిల్లులు, డీటీహెచ్, ఇంటర్నెట్ కార్డు చెల్లింపులూ చేసేంత! హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పేమెంట్ సొల్యూషన్ కంపెనీ పే నియర్ ఇలాంటి సరికొత్త సేవలతో ముందుకొచ్చింది. స్పాట్ పేరుతో పేమెంట్ సొల్యూషన్ యాప్‌ను ఆవిష్కరించినట్లు సంస్థ సీసీఓ అనిల్ భరద్వాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీమా ప్రీమియం, పాలసీ క్లెయిమ్ చేయటం నుంచి వినియోగ సంబంధిత బిల్లుల వరకు అన్నింటినీ దగ్గర్లోని రిటైల్ దుకాణాల్లోనే చేసే వీలుంటుందన్నారు.
మెడికల్ షాపు, కిరాణ కొట్టు, పాన్ షాపు, రిటైల్ స్టోర్, ఇంటర్నెట్ కెఫే ఇలా ఇలాంటి దుకాణాదారులైన స్పాట్ ఏజెంట్లుగా మారొచ్చని ఆయన పేర్కొన్నారు. ‘‘అర్హత గల ఏజెంట్లు, డీలర్లు కొంత మొత్తాన్ని చెల్లించి ఇందుకు సంబంధించిన పరికరాన్ని (డివైజ్) కొనుక్కోవాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్/టాబ్లెట్/పీసీల్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఎంపే డివైజ్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలి. కొనుగోలుదారు చెల్లించాల్సిన మొత్తాన్ని యాప్‌లో ఎంటర్‌చేసిన చేసి.. క్రెడిట్/ డెబిట్ కార్డును స్వైప్ చే స్తే చాలు సంబంధింత చెల్లింపులు జరిగిపోయినట్టే. ఇందుకు గాను ఆయా ఏజెంట్లకు కొంత కమీషన్ అందుతుంది. ఆయా లావాదేవీల వివరాలు కస్టమర్ సెల్‌ఫోన్‌కూ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి కూడా’’ అని అనిల్ వివరించారు.