breaking news
speaker podium
-
అడ్డుకోవడమే విపక్షం అజెండా
సాక్షి, అమరావతి: సమావేశాలు ప్రారంభం అయిన తొలి నిమిషం నుంచే శాసనసభ కార్యకలాపాలను స్తంభింపజేసేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారు. వాయిదా తీర్మానాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ, సభ సంప్రదాయాలకు విరుద్ధంగా ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే.. నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. బీఏసీ సమావేశం నిర్వహించకుండానే వాయిదా తీర్మానానికి ఎలా డిమాండ్ చేస్తారని స్పీకర్ వారిని ప్రశ్నించారు. ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తామని, వాటిలో టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న అంశం లేకపోతే వాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ ఎంత చెబుతున్నా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానానికే పట్టుబట్టారు. నినాదాలు చేసుకుంటూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. పోడియం బల్లను చరుస్తూ నినాదాలు చేశారు. మంత్రులు సమాధానం ఇస్తుండగానే పదేపదే అంతరాయం కలిగించారు. ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణబాబు, అశోక్ తదితరులు స్పీకర్ పోడియం మీదకు వెళ్లి స్పీకర్ చైర్ వద్ద నిలబడి ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరు పట్ల స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో స్పీకర్ 10 నిమిషాలు సభను వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి సమావేశమయ్యాక కూడా వారు వాయిదా తీర్మానానికే పట్టుబట్టి, స్పీకర్ చైర్ వైపు దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్.. మార్షల్స్‌ను పిలిపించి వారు తన వద్దకు రాకుండా అడ్డుగా ఉంచారు. టీడీపీ సభ్యుల నినాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్యే మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేల మృతికి స్పీకర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సంతాపం తెలిపిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ సభను వాయిదా వేశారు. టీడీపీ నాయకులు నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానానికి డిమాండ్ చేయడం పట్ల అధికార పక్షం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సభలో మాటల యుద్ధం నడిచింది. లక్షలాది ఉద్యోగాల ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ అన్నారు. కరోనా కష్ట పరిస్థితుల్లోనూ 2.60 లక్షల మందికి వలంటీర్లు, 1.35 లక్షల మందికి సచివాలయాల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉద్దేశ పూర్వకంగానే సభ కార్యకలాపాలను స్తంభింపజేయాలని వ్యవహరిస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వాళ్లే ప్రశ్నలు అడిగి.. ఆ ప్రశ్నలకు తాము సమాధానాలిచ్చే సమయంలోనే ఆందోళనకు దిగడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టండని డిమాండ్ చేసి.. ఇప్పుడు అడుగడుగునా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని శాసనసభ వ్యవహారాల కో–ఆర్డినేటర్ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. నిరుద్యోగుల గురించి టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు విమర్శించారు. టీడీపీ సభ్యుల రచ్చ శాసన సభ సమావేశాల తొలి రోజే ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చకు దిగారు. స్పీకర్ పోడియం వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించారు. మార్షల్స్‌తో దురుసుగా ప్రవర్తించారు. స్పీకర్ ఎంతగా సర్దిచెప్పినా వినకపోవడంతో చివరకు వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. గురువారం శాసన సభలో వికేంద్రీకరణపై స్వల్ప కాలిక చర్చ చేపట్టిన సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డు తగిలారు. సభకు విఘాతం కలిగించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వికేంద్రీకరణపై మాట్లాడుతుండగా.. ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మైక్ తీసుకుని ప్రతిపక్ష నాయకులు అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అమరావతిలో భూములు కొన్న టీడీపీ నాయకుల జాబితా చదివి వినిపించారు. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరు ఉండటంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. సమయాన్నిబట్టి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పడంతో పయ్యావుల సీట్లో కూర్చున్నారు. రామానాయుడు ప్రసంగం అనంతరం మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతుండగా మరోసారి పయ్యావుల కేశవ్ వెల్‌లోకి వెళ్లారు. ఆయన వెంట ఇతర టీడీపీ సభ్యులు కూడా వెళ్లి పోడియం వద్ద గందరగోళం సృష్టించారు. చైర్ మాటకు విలువలేదంటూ స్పీకర్‌నుద్దేశించి పయ్యావుల వ్యాఖ్యానించగా... చైర్‌కు టీడీపీ సభ్యులు ఎంత విలువ ఇస్తున్నారో పద్ధతిని చూస్తే తెలుస్తుందని స్పీకర్ బదులిచ్చారు. కన్నబాబు ప్రసంగానికి ఆదిలోనే పదేపదే బ్రేక్ పడింది. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో కేశవ్‌కు మైక్ ఇవ్వడంతో రాజధాని ప్రకటన తర్వాతే తన కుటుంబ సభ్యులు భూములు కొన్నారని, దీనిపై ఎటువంటి విచారణకైనా సిద్ధమేనంటూ పయ్యావుల సవాల్ చేశారు. దీంతో ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధారాలతో సహా ఎప్పుడెప్పుడు టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో భూములు కొన్నారో వివరిస్తుండగా.. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్తాయనే భయంతో టీడీపీ సభ్యులందరూ మరోసారి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభను అడ్డుకొన్నారు. సీట్లలో కూర్చోవాలని వారిని స్పీకర్ కోరినా వినిపించుకోలేదు. సీట్లలో కూర్చోకుంటే.. తీసుకెళ్లి కూర్చోబెడతాం అంటూ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్షల్స్‌ను సభలోకి పిలిచారు. పోడియం వద్ద టీడీపీ సభ్యులకు మార్షల్స్ అడ్డుగా నిల్చున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు విధి నిర్వహణలో ఉన్న మార్షల్స్‌ను పదేపదే తోసేస్తూ దురుసుగా ప్రవర్తించారు. మరో ఎమ్మెల్యే రామానాయుడు మార్షల్స్‌ను ఉద్దేశించి ఇదేమీ లోటస్‌పాండ్, వైఎస్సార్సీపీ కార్యాలయం.. కాదంటూ వాగ్వాదానికి దిగారు. చీఫ్ మార్షల్‌తో నువ్వేమన్నా స్పీకర్వా.. మమ్మల్ని ముట్టుకోవద్దు... అంటూ గొడవకు దిగారు. ఇలా పోడియం వద్ద ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. అక్కడే నినాదాలు చేస్తూ సెల్ఫోన్లో ఫొటోలు తీసుకుని.. వాటిని షేర్ చేసుకున్నారు. ఎంతకీ పరిస్థితి దారికి రాకపోవడంతో ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌కు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యుల ఆమోదంతో స్పీకర్ ఆ తీర్మానాన్ని పాస్ చేశారు. టీడీపీ సభ్యులు అశోక్ బెందాళం, అచ్చెన్నాయుడు, చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, బుచ్చయ్య చౌదరి, వెంకటరెడ్డినాయుడు, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మెహన్, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, రామరాజు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌ను ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మండలిలోనూ అదే గొడవ శాసనమండలిలో టీడీపీ సభ్యులు సభాసంప్రదాయాలకు విరుద్ధంగా చైర్మన్ పోడియంను చుట్టుముట్టి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. జాబ్ క్యాలెండర్– రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై తెలుగుదేశం సభ్యులు ఇచి్చన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుపెట్టగానే వారు అడ్డుతగిలారు. తొలుత వారిస్థానాల్లో నిలబడి ప్లకార్డులు, నినాదాలతో నిరసన తెలిపిన సభ్యులు తర్వాత పోడియం ముందుకు వచ్చారు. కొందరు చైర్మన్ మోషేన్ రాజు సీటు వద్దకు వెళ్లి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, సీనియర్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం సభ్యుల తీరును తప్పుబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లో సభ్యులు గలాటా చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం సభ్యులపై చర్యలు తీసుకుని సభను ఆర్డర్లో పెట్టాలని కోరారు. చైర్మన్ పదేపదే హెచ్చరించగా టీడీపీ సభ్యులు పోడియం దిగి ముందు నిలబడి నినాదాలు కొనసాగించడంతో టీబ్రేక్ ఇస్తూ సభను వాయిదా వేశారు. -
లెక్కలు తేల్చాల్సిందే
మైనారిటీలకు కేటాయింపుల లెక్కల్లో తేడాలు వైఎఎస్ఆర్సీపీ సభ్యుల తీవ్ర నిరసన పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు స్పీకర్ వైఖరి నశించాలంటూ నినాదాలు హైదరాబాద్ మైనారిటీల వ్యవహారంపై మంత్రి చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వివరించబోతుండగా మధ్యలోనే ఆపినందుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. స్పీకర్ వైఖరి నశించాలంటూ నినదించారు. మైనారిటీలకు కేటాయించిన నిధుల లెక్కలు తేల్చాలని పట్టుబట్టారు. వుయ్ వాంట్ జస్టిస్ అని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టేందుకే ఇలా చేస్తోందని, లెక్కలు చూపించడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగానే మైకులు కట్ చేయడం ఏంటని, చర్చకు ఎందుకు అవకాశం ఇవ్వరని అడుగుతూ పోడియం వద్ద బైఠాయించారు. తొలుత మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రన్న రంజాన్ కానుక పేరుతో ఒకసారి, రంజాన్ కానుక పేరుతో మరోసారి వారికి సాయం అందిస్తున్నామని మంత్రి రఘునాథరెడ్డి చెప్పారు. దీనికి కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా అభ్యంతరం తెలిపారు. మంత్రి చెబుతున్నది చూస్తుంటే మైనారిటీలకు ప్రభుత్వం చాలా చేసేస్తోందని అనిపిస్తుందని, కానీ అవన్నీ అవాస్తవాలని అన్నారు. మైనారిటీల కోసం అదనంగా నిధులు ఖర్చు చేశామంటున్నారు గానీ, అదంతా తప్పేనన్నారు. రెండేళ్ల క్రితం బడ్జెట్లో రూ. 246 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. 2015-16 బడ్జెట్లో రూ. 376 కోట్లు మైనారిటీల సంక్షేమానికి కేటాయించారని, కానీ బడ్జెట్ నివేదికలో మాత్రం రూ. 216 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. మైనారిటీ హాస్టళ్లకు రూ. 3.35 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఇలా బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా ఖర్చుపెట్టినట్లు చెప్పడం ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న దానికి, వాస్తవానికి పొంతన లేదని అన్నారు. అయితే చాంద్ బాషా ఇలా వివరిస్తుండగానే.. స్పీకర్ కలగజేసుకుని, సబ్జెక్టుల వారీగా వివరంగా అక్కర్లేదని, తక్కువగా ఖర్చు పెట్టారని చెబితే సరిపోతుందని అన్నారు. అయితే గతంలో ఒకో ప్రశ్నకు 20-40 నిమిషాలు కూడా కేటాయించేవారని, ఇప్పుడు మైనారిటీలకు సంబంధించిన అంశానికి కనీసం 5 నిమిషాలైనా ఇవ్వకపోతే ఎలాగని చాంద్ బాషా అడిగారు. కనీసం అనుబంధ ప్రశ్నకు అయినా అవకాశం ఇవ్వపోతే ఎలాగని అన్నారు. అయినా స్పీకర్ మాత్రం మంత్రి పల్లె రఘునాథరెడ్డిని సమాధానం ఇవ్వాలని చెప్పారు. దాంతో ఆయన సమాధానం ఇస్తుండగానే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా లేచి నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. కొద్దిసేపటి తర్వాత, టీ విరామం కోసం అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేశారు. -
వెల్‌లోకి వెళ్తే సస్పెండ్ చేయాల్సిందే: దిగ్విజయ్
సభలో ఎవరైనా సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్తే వాళ్లను సస్పెండ్ చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఓ నిబంధన ఉందిగానీ, దాన్ని సరిగా ఇంతవరకు అమలు చేయలేదని ఆయన చెప్పారు. అనవసర నిరసనల కారణంగా చాలా ముఖ్యమైన బిల్లులు పెండింగులో ఉండిపోతున్నాయని, ప్రజలకు రాజకీయాలంటే నమ్మకం లేకుండా పోతోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.