breaking news
Slab
-
తాత్కాలిక పర్మిట్ పేరుతో ఖజానాకు కన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాత్రమే తిరిగే టూరిస్టు బస్సులు తాత్కాలిక పర్మిట్ పేరుతో ఖజానాకు టోకరా వేస్తున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులను ఆసరా చేసుకుని రవాణా శాఖను బురిడీ కొట్టిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్న తీరును నియంత్రించేందుకు తాజాగా రవాణాశాఖ చేపట్టిన చర్యలను ఇప్పుడు ఆ బస్సుల నిర్వాహకులు వ్యతిరేకిస్తూ పాత విధానమే కొనసాగేలా చక్రం తిప్పుతున్నారు. అయితే, ఈ పర్మిట్ విధానాన్ని మార్చి టూరిస్టు బస్సుల అక్రమాలకు చెక్ పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రవాణాశాఖ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు ఈ అంశం ఆసక్తిగా మారింది. చిన్న జిల్లా పరిధి పేరు చెప్పి... ఇతర రాష్ట్రాలకు తిరిగే ట్రావెల్స్ బస్సులు కాకుండా, కేవలం రాష్ట్రం పరిధిలో మాత్రమే తిరిగే టూరిస్టు బస్సులు దాదాపు 8,500 వరకు ఉన్నాయి. ఈ బస్సు నిర్వాహకులు రవాణా శాఖకు త్రైమాసిక పన్ను చెల్లించి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆది నుంచి రాష్ట్రంలో ఈ పర్మిట్‌కు మూడు రకాల శ్లాబుల విధానం ఉంది. ఒక జిల్లా పరిధిలో తిరిగే పర్మిట్‌కు బస్సులోని ప్రతి సీటుకు రూ.1,120 చొప్పున, రెండు జిల్లాల పరిధిలో అయితే రూ.1,510 చొప్పున, రాష్ట్రం మొత్తం అయితే రూ.3,285 చొప్పున మూడు నెలలకోమారు చెల్లించాలి.పొరుగు రాష్ట్రాల్లో మాత్రం రాష్టం మొత్తం యూనిట్‌గా ఒకే శ్లాబు ఉంది. అయితే, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన జిల్లాల పునర్విభజనతో గందరగోళం నెలకొంది. జిల్లాల పరిధి అతి చిన్నదిగా మారి, బస్సు 20 కి.మీ. తిరిగితే చాలు పొరుగు జిల్లా పరిధిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో, ఒక జిల్లా పర్మిట్ తీసుకున్న బస్సులు ముందుకు సాగటం కష్టంగా మారింది. దీన్ని నివారించేందుకు తాత్కాలిక రూట్ పర్మిట్ విధానాన్ని ప్రారంభించారు. జిల్లా పరిధి దాటి వెళ్లేట్టయితే, ఆ నిర్ధారిత రూట్లో వెళ్లి వచ్చేందుకు ఈ తాత్కాలిక పర్మిట్ వీలు కల్పిస్తుంది. రెండు జిల్లాల పర్మిట్ తీసుకున్నవారు కూడా ఆ పరిధి దాటి వెళ్లాల్సి వస్తే కూడా ఈ తాత్కాలిక రూట్ పర్మిట్ అనుకూలంగా మారింది.దీన్ని కొందరు బస్సు నిర్వాహకులు అక్రమాలకు అనుకూలంగా మార్చుకున్నారు. తాత్కాలిక రూట్ పర్మిట్ రూ.200 నుంచి రూ.500 నామమాత్రంగా ఉండటంతో, సింగిల్ జిల్లా పర్మిట్ తీసుకుని ఆ తర్వాత పరిధి దాటి వెళ్లాల్సి వస్తోందని ఈ తాత్కాలిక రూట్ పర్మిట్ పొంది రాష్ట్రం మొత్తం అక్రమంగా తిప్పుతున్నారు. దీంతో రవాణాశాఖకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,500 టూరిస్టు బస్సులు తిరుగుతుంటే, వాటిల్లో ఒక జిల్లా పర్మిట్ తీసుకున్నవి 6,572 ఉన్నాయి. రెండు జిల్లాల పర్మిట్ పొందినవి 1,684 ఉంటే, రాష్ట్ర పర్మిట్ పొందినవి నామమాత్రంగా 138 మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏకంగా 85 వేలకు పైగా తాత్కాలిక రూట్ పర్మిట్లు జారీ అవడం పరిస్థితిని తెలుపుతోంది. దిద్దుబాటులో రవాణాశాఖ ఈ అక్రమాలకు కళ్లెం వేసి ఆదాయాన్ని పెంచుకోవాలని రవాణాశాఖ నిర్ణయించింది. మూడు శ్లాబులు తొలగించి పొరుగు రాష్ట్రాల తరహాలో రాష్ట్రం మొత్తం ఒకే పర్మిట్ ఉండేలా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికోసం శుక్రవారం టూరిస్టు బస్సు నిర్వాహకులతో రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, అదనపు కమిషనర్ రమేశ్, జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఒకే శ్లాబు విధానం వద్దని, ఎప్పటి మాదిరిగానే మూడు శ్లాబుల విధానం ఉండాలని ఎక్కువ మంది కోరారు. దీనిపై అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ దీనిపై అధ్యయనం చేసి త్వరలో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా పన్నుల విధానంలో మార్పులు చేయనున్నారు. ఒక జిల్లా పర్మిట్‌ను తొలగించి మూడునాలుగు జిల్లాలు కలిపి ఒక పర్మిట్ ఉండేలా మరో ప్రత్యామ్నాయ అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. -
మెట్రో చార్జీల పెంపును వ్యతిరేకించిన ఎమ్మెమ్మార్డీఏ
- స్లాబ్ ప్రకారం అమలు చేయాలని విజ్ఞప్తి సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో చార్జీల పెంపును ఎమ్మెమ్మార్డీఏ వ్యతిరేకించింది. వీటికి బదులుగా స్లాబ్ ప్రకారం రూ.9, రూ.12, రూ.13లను అమలు చేయాలని కోరింది. గత జనవరి 8న చార్జీల పెంపు కోసం విజ్ఞప్తి చేయడంతో రూ.10-40 చార్జీలను పెంచేందుకు ఎంఎంఓపీఎల్‌కు బాంబే హైకోర్టు అనుమతించింది. మూడు నెలల్లో చార్జీలను ఖరారు చేయాలని కమిటీ ని కోర్టు ఆదేశించింది. దీంతో చార్జీలను పెంచే ముందు ప్రయాణికులు, ఇతర సంస్థల నుంచి ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అభిప్రాయాలు కోరింది. రోజుకు దాదాపు మూడు లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. ఆసక్తి ఉన్న వారు అభిప్రాయాలను రాత పూర్వకంగా లేదా ఈ-మెయిల్ ద్వారా మే నెలాఖరు లోపు సబ్మిట్ చేయాల్సిందిగా కమిటీ కోరింది. నోడల్ అధికారులకు లేదా చార్జీలను నిర్ణయించే కమిటీ (ఫేర్ ఫిక్సేషన్ కమిటీ), మెట్రో డీఎన్కు ప్రయాణికులు వాటిని పంపించాలని పేర్కొంది. పార్టీలు కూడా తమ అభిప్రాయాలను ఈ-మెయిల్ చేయవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎంఎంఓపీఎల్లో 26 శాతం వాటా ఉన్న ప్రభుత్వ ఏజెన్సీ ఎమ్మెమ్మార్డీఏ ఈ కొత్త చార్జీలను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంది.


