breaking news
sanapa
-
సనపలో మధ్యాహ్న భోజనం బంద్
ఆత్మకూరు: మండల పరిధిలోని సనప ప్రాథమిక పాఠశాలలో వారం రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వాపోతున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు వారం రోజులగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చెయ్యలేదు. దీంతో విద్యార్థులు నిత్యం ఇళ్ల దగ్గర నుంచి భోజనం తెచ్చుకోవడమో లేక ఇళ్లకు వెళ్లి తిని రావడమో చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు పలు సార్లు తెలిపినా ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గిట్టుబాటు కాలేదని వదిలేశారు : ఈ విషయంపై ఎంఈఓ నరసింహారెడ్డిని వివరణ కోరగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు గిట్టుబాటు కాకపోవడంతో వదిలేశారన్నారు. మధ్యలో రెండు రోజులపాటు ఇతరులచే భోజనాలు వడ్డించి విద్యార్థులకు అందచేశామని, ప్రస్తుతం మళ్లీ అదే సమస్య ఏర్పడిందన్నారు. సోమవారం ఈ సమస్యను పూర్తి పరిష్కారం కల్పిస్తామని ఎంపీడీఓ తెలిపారు. కాగా సనప ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఆదినారాయణను కలిసి తమ సమస్యను తెలియజేసినట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
కదిరి టౌన్/ ఎస్కేయూ : జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. కుమారుడికి ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని వచ్చే క్రమంలో తండ్రి, అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ మహిళ మృత్యువాతపడిన వారిలో ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన నూనె వ్యాపారి మహబూబ్‌బాషా (50) తన కుమారుడు ముస్తాక్‌కు ఆరోగ్యం బాగలేకపోవడంతో సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. ఆస్పత్రిలో చూపించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. మహబూబ్‌బాషాకు తీవ్రంగాను, కుమారుడికి స్వల్పంగాను గాయాలయ్యాయి. స్థానికులు కదిరి ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అనంతరం తీసుకెళ్లాలని వైద్యులు సూచించేలోపే మహబూబ్‌బాషా మృతి చెందాడు. మృతదేహంపై పడి భార్య, కుటుంబ సభ్యులు రోదించిన తీరు కలచివేసింది. తనకల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన రాజేంద్ర, భవానీ భార్యాభర్తలు. భవానీ తండ్రి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇద్దరూ కదిరికి వెళ్లారు. సోమవారం వీరిద్దరూ లక్ష్మిదేవి (45) అనే మహిళతో కలిసి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయల్దేరారు. ఎస్కేయూ సమీపంలోని సమతాగ్రాం వద్ద ఈచర్ వాహనాన్ని దాటే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. తలకు తీవ్రగాయం కావడంతో లక్ష్మిదేవి (45) అక్కడికక్కడే చనిపోయింది. రాజేంద్ర, భవానీలకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.