ఆగని పోరు
సాక్షి, కడప : స్వాతంత్య్ర దినోత్సవం రోజున భరతమాతకు జనమంతా జేజేలు పలుకుతూనే రాష్ట్ర విభజన చిచ్చుపై జిల్లాలో విభిన్న రీతిలో ఆందోళనలు చేశారు. తెలుగుజాతిని విడదీయొద్దంటూ రోడ్డెక్కి నినదించారు. సమైక్య ఉద్యమం మొదలైనప్పటి నుంచి ప్రజలు విశ్రమించడం లేదు. దీనికితోడు ఉద్యోగులు సమ్మె అస్త్రం సంధించడంతో పోరాటం పతాక స్థాయికి చేరింది. మరోవైపు విద్యార్థి లోకం వ్యాపార, వాణిజ్య వర్గాలు,వివిధ వివిధ సంఘాలు సమక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా గర్జిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు ఆపబోమని హెచ్చరిస్తున్నారు. కడపలో నగర పాలకసంస్థ ఉద్యోగులు, జేఏసీ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి, సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు నల్ల బ్యాడ్జీలతో గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాతోపాటు సమైక్యాంధ్ర జెండాను ఎగురవేశారు.
కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షలు గురువారంతో నాల్గవ రోజు పూర్తయ్యాయి. వీరికి సంఘీభావంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు, మహిళలుతరలి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో దీక్షా ప్రాంగణం మార్మోగిపోయింది. వైఎస్సార్సీపీ సాంసృ్కతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఆటాపాటా సమైక్య వాదులను ఆకట్టుకుంది. దీక్షలకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, సురేష్‌బాబు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. రిమ్స్ వైద్యులు సురేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉపాధ్యాయ దీక్షా శిబిరాల వద్ద వరలక్ష్మీవ్రతాలు చేపట్టాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
జమ్మలమడుగులో వర్షంలోనే పాఠశాలల విద్యార్థులు డ్యాన్స్ చేస్తూ వినూత్న రీతిలో తమ నిరనన తెలియజేశారు. మోరగుడిలో వంటా వార్పు చేపట్టారు. మాలమహానాడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఎర్రగుంట్లలో 10వరోజు రిలే దీక్షలు టైలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్టీపీపీ ఎస్ఈ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు కడపలో దీక్షలు చేస్తున్న వారికి తమ సంఘీభావాన్ని తెలిపారు.
ప్రొద్దుటూరులోశాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పుట్టపర్తి సర్కిల్లో రోడ్డుపైనే కుండలు తయారు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తహశీల్దార్లు డప్పుకొట్టి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, స్వర్ణకారుల సంఘం, శారద జూనియర్ కళాశాల సిబ్బంది వేర్వేరు చోట్ల రిలే దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రికల్ వ్యాపారులు 67 అడుగుల జాతీయ జెండాను తయారు చేసి పట్టణంలో ఊరేగించారు. వైఎస్సార్సీపీ నేత రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద సమైక్య జెండాలను ఎగురవేశారు.
పులివెందులలో వడ్డెర సంఘం, టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యాధరి, అస్లం టెక్నో స్కూలు విద్యార్థులు రోడ్డుపైనే కరాటే, సాంసృ్కతిక కార్యక్రమాలు చేపట్టారు. పూల అంగళ్ల సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వేంపల్లెలో పోలీసు సంఘం ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు.
రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు టోల్గేట్ సర్కిల్లో గురువారం ఆమరణ దీక్షకు చేపట్టారు. ఈ సందర్బంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మనందరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పంజం సుకుమార్రెడ్డితోపాటు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లతోపాటు పెద్ద ఎత్తున ప్రజలు దీక్షకు సంఘీభావం తెలియజేశారు. జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ దీక్షల్లో పాల్గొని మాట్లాడారు.
రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఉదయం మన్నూరు ఎల్లమ్మ గుడి నుంచి పాత బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి తగులబెట్టారు. కళాకారులు జాతీయ నాయకుల వేషధారణతో ఆకట్టుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి దీక్షలకు తమ మద్దతు తెలిపారు. చంద్రబాబు తెలంగాణకు మద్దతుగా ఇచ్చిన లేఖను రఘురామిరెడ్డి విడుదల చేశారు.
బద్వేలులో జేఏసీ ఆద్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. మెప్మా, మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విత్తన వ్యాపారుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగాయి.
కమలాపురం పంచాయతీ కార్యాలయంలో గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన దీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల, పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మైదుకూరులో న్యాయవాదులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. విద్యార్థులు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల వేషధారణలో పలువురు ఆకర్షించారు.
రాయచోటిలో ఆర్టీసీ కార్మికుల, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.