breaking news
Samagra Criminals Survey
-
బీ అలర్ట్ ; సకల నేరస్తుల సమగ్ర సర్వే రేపే..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గుర్తుందికదా! ఎక్కడెక్కడి జనం ఆయా ఊళ్లకు తరలివెళ్లగా, అధికారులు వచ్చి పేర్లు, వివరాలు నమోదుచేసుకుని, టెక్నాలజీ సాయంతో భద్రపర్చారు. సరిగ్గా అలాంటి సర్వేనే నేరస్తుల కోసం ప్రత్యేకంగా చేపట్టనుంది రాష్ట్ర పోలీసు శాఖ. ‘సకల నేరస్తుల సమగ్ర సర్వే’ పేరుతో జనవరి 18న(గురువారం) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ సహా 31 జిల్లాల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు : జనవరి 18న జరుగనున్న సకల నేరస్తుల సమగ్ర సర్వేలో డీజీపీ నుంచి కానిస్టేబుల్ దాకా అన్ని హోదాల్లో పనిచేస్తున్నవారు భాగంపంచుకుంటారని పోలీస్ బాస్ చెప్పుకొచ్చారు. ఆయా స్టేషన్ల పరిధిలో 10ఏళ్ల నాటి నేరస్తుల పూర్తి వివరాలను సేకరించనున్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంలో భాగంగా వారి తాజా ఫోటోలతోపాటు వేలిముద్రలను తీసుకోనున్నారు. అంతేకాదు, వారు నివసిస్తోన్న ఇళ్లను పోలీస్ శాఖ వెబ్‌సైట్‌కు జియోట్యాగింగ్ చేయనున్నారు. ఎందుకీ సర్వే?: తెలంగాణను నేరరహిత (క్రైమ్ ఫ్రీ) రాష్ట్రంగా మార్చాలనే తలంపుతో ప్రభుత్వం పలు ప్రణాళికలను రూపొందించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవడం అందులో ఒకటి. గ్రేటర్ సహా ఆయా జిల్లాల్లో నేరస్తుల కదలికలపై నిఘా ఉంచితే.. కొంతమేరలో కొత్త నేరాలకు అడ్డుకట్టవేయొచ్చన్నది పోలీసుల భావన. అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ శాఖ జనవరి 1న టీఎస్-కాప్ యాప్‌ను ప్రారంభించింది. ఆ యాప్‌లో అనేక విషయాలకు సంబంధించిన ఆప్లికేషన్స్ పొందుపర్చారు. గురువారం చేపట్టనున్న సర్వేలో వెల్లడయ్యే అంశాలను కూడా యాప్‌లో పొందుపరుస్తారు. -
హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే: సీపీ
హైదరాబాద్ : నగరంలోని పాత నేరస్థులపై పోలీసులతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో మహేందర్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...2011 నుంచి పాత నేరస్థులకు చెందిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. మొత్తం 11,500 మంది పాత నేరస్థులున్నారని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోనే 7500 మంది పాత నేరస్థులు ఉన్నారని తెలిపారు. పాత నేరస్థుల వివరాల సేకరణ కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. నేరాలు అరికట్టేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.