breaking news
salarys hike
-
ఆర్టీసీలో నయా జోష్!
సాక్షి, విశాఖపట్నం : కొత్త సర్కారు కొలువుదీరాక ఆర్టీసీలో కొత్త జోష్ నెలకొంది. భారీ సంఖ్యలో కొత్త నియామకాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పదోన్నతులు, ఐచ్ఛిక బదిలీలకు వీలు కల్పిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆర్టీసీ విజయనగరం జోన్లో త్వరలో 700 మంది డ్రైవర్లు, 200 మంది కండక్టర్ల నియామకం చేపట్టనున్నట్టు ఆ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పి.కృష్ణమోహన్ వెల్లడించారు. ఇటీవల ఈడీగా బాధ్యతలు చేపట్టిన ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► కండక్టరు నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకు ఇంజినీరింగ్, పర్సనల్, అకౌంట్స్, స్టోర్స్ విభాగాల్లోని ఏడీసీలు, టీఐ3, డిప్యూటీ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్లకు గతంలో తాత్కాలికంగా పదోన్నతులు పొందిన 62 మందిని క్రమబద్ధీకరిస్తున్నాం. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. ► కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో విజయనగరం జోన్లో 14 మంది డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లకు ప్రయోజనం చేకూరుతోంది. మరో 240 పనిదినాలు పూర్తి చేసిన 50 మందికి త్వరలో రెగ్యులరైజ్ చేయబోతున్నాం. ► జోన్ పరిధిలో 700 మంది డ్రైవర్లు, 200 మంది కండక్టర్ల నియామకాన్ని చేపట్టనున్నాం. వీరిలో 200 మందిని ఈ నెలలోనే నియమిస్తాం. మిగిలిన వారిని ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నియామకాలు జరుపుతాం. దశల వారీగా వచ్చే ఏడాది డిసెంబర్ లోగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం. ► విజయనగరం జోన్లో 400 వరకు వివిధ స్థాయిల్లో ఖాళీలున్నాయి. కొన్నింటిని కండక్టర్లకు ఏడీసీలుగా పదోన్నతులిచ్చి భర్తీ చేస్తాం. మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి యాజమాన్యం అనుమతి కోరాం. ► కొత్త ప్రభుత్వం అర్టీసీ ఉద్యోగుల అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతినిచ్చింది. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, మెకానిక్‌ల వద్ద అసిస్టెంట్లుగా పనిచేసే వారు తాము కోరుకున్న చోటుకు బదిలీకి అవకాశం కల్పించింది. 2005 నుంచి ఒక జిల్లా వారు మరో జిల్లాలో పనిచేస్తున్న వారున్నారు. వారి అభీష్టం మేరకు సొంత జిల్లా లేదా ఇతర జిల్లాలకు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే విజయనగరం జోన్లో 400 మందికి పైగా అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా బదిలీ కోరుకుంటే ఈనెల 6 వరకు అవకాశం ఉంది. పది రోజుల్లో ఈ అంతర్ జిల్లాల బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తాం. పార్శిల్ కౌంటర్ల ఆధునికీకరణ.. ∙సురక్షితంగా లగేజి చేరవేయడం కోసం ఆర్టీసీ నిర్వహిస్తున్న పార్శిల్ కౌంటర్లను ఆధునికీకరణ ప్రక్రియ జరుగుతోంది. జోన్ పరిధిలో ఉన్న పార్శిల్ కౌంటర్లలో సీసీ కెమెరాలు, కంప్యూటరైజేషన్, వెహికల్ ట్రాకింగ్, ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఫిర్యాదుల సెల్‌ను ఈనెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చాం. 60 ఎలక్ట్రిక్ బస్సులకు ప్రతిపాదన.. ∙రాష్ట్రంలో 350 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో విశాఖ రీజియన్‌కు 60 ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ∙ఆధునిక సదుపాయాలున్న కరోనా బస్సుల పనితీరు బాగున్నా ఆ సంస్థ సేవలు సంతృప్తికరంగా లేవు. లోపాలు తలెత్తిన సత్వరమే సరిచేయాలని కోరుతున్నాం. అయినా జాప్యం జరుగుతోంది. విశాఖ రీజియన్‌లో 8 కరోనా బస్సులు నడుస్తున్నాయి. -
ఉద్యోగులకు భరోసా
ఆదిలాబాద్‌టౌన్: కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న ఆశ కార్యకర్తలు, ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, గోపాలమిత్రలు, సెకండ్ ఏఎన్ఎంలు, కాంట్రాక్టు వైద్యులు ఈ పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి నివేదన సభ కంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వేతనాలు పెంచినప్పటికీ వీరికి మేలు జరగనుంది. ఇన్ని రోజులు నిరాశతో విధులు నిర్వహిస్తున్న ఉన్న వీరు పెంచిన వేతనాలతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే అవకాశం ఉంది. ‘రెండింతల’ ఉత్సాహం.. సెకండ్ ఏఎన్‌ఎంలలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి రూ.11వేల నుంచి రూ.21 వేలకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా వీరు తక్కువ వేతనంతోనే విధులు నిర్వహిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలుసార్లు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. 2016లో దాదాపు 48 రోజుల పాటు సమ్మె చేపట్టారు. విధులు నిర్వహించకుండా డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట, కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఆ సమయంలో ప్రభుత్వం సమ్మెను విరమిస్తే కానీ వేతనాలు పెంచమని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక వారు సమ్మెను విరమించుకున్నారు. సమ్మె చేసిన కాలంలో వీరికి వేతనం చెల్లించలేదు. అప్పటి నుంచి నిరాశలో ఉన్న వీరు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చేసిన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వీరి పట్ల కరుణ చూపింది. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 129 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీరు ఉప కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారు. మాతా శిశు మరణాలను తగ్గించడం, ఇమ్యునైజేషన్ నిర్వహించడం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం, క్లోరినేషన్ చేయించడం, జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, క్షయ, కుష్టు, తదితర వ్యాధిగ్రస్తులను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యసేవలు చేయించడం, తదితర సేవలు అందిస్తున్నారు. మొదటి ఏఎన్ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరికి నెలకు రూ.11వేలు వేతనం చెల్లించడం, రెగ్యులర్ ఏఎన్ఎంలకు రూ.20 వేలు చెల్లించడంతో వారు గతంలో ఆందోళన బాట పట్టారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో రూ.21 వేలు వేతనం అందనుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెరవేరిన ఆశలు.. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో ఏఎన్ఎంలతో సమానంగా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు చాలీచాలనీ వేతనాలు పొందుతూ కాలం వెళ్లదీస్తున్నారు. గతేడాది క్రితం రూ.వెయ్యి వరకు ఉన్న పారితోషికాన్ని రూ.6 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.6 వేల నుంచి రూ.7,500కు వేతనం పెంచారు. ఈ నిర్ణయంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 1024 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నారు. ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి మరోసారి రూ.1500 వేతనం పెంచింది. వీరు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి తీసుకెళ్లడం, గ్రామాల్లో డయేరియా, తదితర వ్యాధులు ప్రబలినప్పుడు అప్రమత్తమై అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు క్లోరినేషన్ చేయిస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకం విజయవంతం కావడంలో వీరి పాత్ర కీలకం. టీబీ వ్యాధికి గురైన వారిని సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి మందులను ఇప్పిస్తున్నారు. వేతనాలు పెంచడంపై ఆశ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు వైద్యులకు వేతనం పెంపు.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 34 మంది కాంట్రాక్టు వైద్యులు పని చేస్తున్నారు. జిల్లాలో కేవలం 10 మంది మాత్రమే రెగ్యులర్ వైద్యులు ఉన్నారు. ఆదిలాబాద్‌లోని 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం నలుగురు మాత్రమే కాంట్రాక్టు వైద్యులు పని చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు వైద్యులకు ప్రభుత్వం ప్రస్తుతం రూ.40 వేలు వేతనం చెల్లిస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు మాత్రం రూ.36 వేలు వేతనం చెల్లిస్తున్నారు. తాజాగా కేబినెట్ నిర్ణయంలో వీరికి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పని చేస్తున్న వైద్యులతో సమానంగా రూ.40వేల వేతనం పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. గోపాలమిత్రలకు.. పశు సంవర్థక శాఖలో గోపాలమిత్రలు పాడి అభివృద్ధి కోసం గత కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లి గ్రామాల్లోని ఆవులు, గేదెల్లో క్రాస్ బీడ్ చేస్తూ సంకరజాతి పశువుల పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాల ఉత్పత్తులు పెరుగుతున్నాయి. అంతే కాకుండా గ్రామాల్లో పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత 15 ఏళ్లుగా వీరు చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కేవలం రూ.3500తో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇది వరకు వేతనాలు పెంచకపోవడంతో చాలా మంది గోపాలమిత్రలు విధుల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 9 మంది మాత్రమే పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం రూ.7500కు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చాలా ఆనందంగా ఉంది.. గత కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. పెరిగిన నిత్యావసర ధరలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. వేతనాలు పెంచాలని గతంలో పలుసార్లు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఆనందాన్నిచ్చింది. మొదటి ఏఎన్ఎంలతో సమానంగా విధులు నిర్వహించినప్పటికీ వేతనాల్లో తారతమ్యం ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. – సునిత, సెకండ్ ఏఎన్ఎం, భీంసరి, ఆదిలాబాద్ ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యులకు వేతనం పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వారికి రూ.40 వేలు చెల్లిస్తుండగా, మాకు మాత్రం రూ.33 వేలు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం మా సేవలను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. – డాక్టర్ వినోద్, ఆదిలాబాద్ -
ఐకేపీ ఉద్యోగుల వేతనాలు పెంపు
♦ ఉత్తర్వులు జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ ♦ ఎంసీసీలకు వందశాతం పెరిగిన జీతం ♦ మిగతా ఉద్యోగులకు 30శాతం పెరుగుదల ♦ జిల్లాలో 403 ఉద్యోగులకు లబ్ధి ♦ ఆగస్టు నుంచే పెరుగుదల అమలు సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల నిరీక్షణ ఫలించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలనే డిమాండును ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. వారి వేతనాలను పెంచుతూ గురువారం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్ల వేతనాలను ఏకంగా రెట్టింపు చేసింది. ప్రస్తుతం వీరికి రూ.6,200 ఇస్తుండగా.. ఇకపై రూ.12,000 ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో పనిచేస్తున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్ తదితరులకు వారి బేసిక్ వేతనంపై 30శాతం పెంచుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ పెంపును ఆగస్టు నుంచే అమలు చేయనున్నట్లు వివరించింది. ఈక్రమంలో వచ్చేనెల వేతనం నుంచే పెరిగిన మొత్తాన్ని ఉద్యోగులు తీసుకోనున్నారు. దీంతో జిల్లాలో పనిచేస్తున్న 403 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం జిల్లాలోని ఐకేపీ ఉద్యోగులకు నెలవారీగా రూ.66.84లక్షలు వేతనాల రూపంలో అందిస్తున్నారు. తాజా పెరుగుదలతో జిల్లాపై రూ.20లక్షల భారం పడనుంది. 50శాతం పెంచాలన్నాం.. ఇందిరా క్రాంతిపథంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన పెంపు కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం. అందరికీ 50శాతం పెంచాలని కోరాం. కానీ ఎంసీసీల వేతనాల్ని మెరుగ్గా పెంచినప్పటికీ.. మిగతా ఉద్యోగులకు బేసిక్పైన 30శాతం మాత్రమే పెంచారు. దీంతో ఇతర కేటగిరీల ఉద్యోగులు కొంత నిరుత్సాహంలోనే ఉన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో మరింత మెరుగ్గా వేతనాలు పెంచుతారని ఆశిస్తున్నా. ప్రస్తుత పెంపుపై ప్రభుత్వానికి కతజ్ఞతలు చెబుతున్నా. - సురేష్‌రెడ్డి, ఐకేపీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు