breaking news
SakshiMalik
-
సాక్షికి ఎయిర్ ఇండియా నజరానా
రియో 2016 ఒలింపిక్స్ లో కోట్లాది భారతీయుల కలను సాకారం చేసిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కు ఎయిర్ ఇండియా మరో అరుదైన బహుమతిని ప్రకటించింది. మహిళల ఫ్రీ స్టైల్ 58 కిలోల రెజ్లింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నహరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్ (23 ) విజయానికి గుర్తుగా నజరానాను అందించనుంది. ఒక సంవత్సరంపాటు వర్తించేలా ఏదైనా రెండు ప్రదేశాలకు, రెండు బిజినెస్ క్లాస్ రిటన్ టికెట్స్ ను (సాక్షి, ఆమెతోపాటు మరొకరికి) ఉచితంగా అందిస్తున్నట్టు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. విమానంలో ప్రయాణించే క్రీడాకారిణి కావాలని కలలు కన్న సాక్షిని తాము ఇలా సన్మానించనున్నట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇది తమకు గర్వకారణమని ఎయిర్ ఇండియా సీఎండీ అశ్విన్ లోహాని రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పై ఇప్పటికే ఒకవైపు అభినందనల వెల్లువ, మరోవైపు భారీ నజరానాలు అందుతున్నాయి. హర్యానా ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదుతో పాటు ప్రభుత్వం ఉద్యోగం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ.20 లక్షల ప్రత్యేక అవార్డు, రైల్వేశాఖ రూ.60 లక్షలు ఇవ్వనుంది. అటు భారత ఒలింపిక్ సమాఖ్య తొలిసారిగా కాంస్య పతక విజేతకు రూ.20 లక్షలు బహుమతిని ప్రకటించింది. వీటితో పాటు రియో ఒలింపిక్స్ కు సౌహార్ద్ర రాయబారిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రూ. లక్ష అందజేయనున్నారు. 2014 లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా సాక్షి రజత పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. #AI is happy to offer two Business class return tickets to the pride of Nation,#SakshiMalik.You made us proud.#Rio2016. — Air India (@airindiain) August 19, 2016 -
ఇంతకన్నా గొప్ప 'రాఖీ' కానుక ఉండదేమో!
అన్నా-చెల్లెలి అనుబంధానికి రక్షగా నిలిచే రాఖీ పండుగను జరుపుకొంటున్న తరుణంలోనే రెజ్లర్ సాక్షి మాలిక్ దేశంలో కొత్త ఆనందాన్ని నింపారు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టారు. తన సోదరి సాధించిన ఈ విజయంపై సాక్షిమాలిక్ సోదరుడు సచిన్ రాధాకృష్ణన్ ఆనందం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఇంతకన్నా గొప్ప కానుకను ఏ చెల్లి కూడా తన అన్నకు ఇచ్చి ఉండదంటూ ఆయన పేర్కొన్నారు. పతకం గెలువాగానే తాను సాక్షికి రక్షాబంధన్ మెసేజ్ పంపించానని, ఒక అన్నగా ఆమెను తనకు ఎంత ఆప్యాయత ఉందో ఆ మెసేజ్‌లో తెలియజేశానని సచిన్ చెప్పారు. మరోవైపు సాక్షి మాలిక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆమెను పెద్ద ఎత్తున అభినందిస్తూ.. మహిళా శక్తిని చాటిన సాక్షికి నీరాజనాలు పడుతున్నారు. ఆమె ప్రతిభను కీర్తిస్తూ ట్వీట్ చేస్తున్నారు. -
నిరాశ పరిచిన సాక్షి మాలిక్
భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. రియో ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫొగట్ ప్రిక్వార్టర్స్ లో శుభారంభం చేసినా, క్వార్టర్స్ లో మాత్రం వెనుకంజ వేశారు. మహిళల 58 కేజీల ప్రీ స్టైల్ విభాగంలో క్వార్టర్స్ లో రష్యాకు చెందిన రెజ్లర్ వలేరియా కోబ్లోవా భారత రెజ్లర్ సాక్షి మాలిక్ పై 3-1 తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడి మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.